‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం  | INDIA Bloc unites to oppose the Delimitation Bill | Sakshi
Sakshi News home page

‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం 

Apr 16 2026 5:36 AM | Updated on Apr 16 2026 5:36 AM

INDIA Bloc unites to oppose the Delimitation Bill

మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు  

జనగణన, డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దు 

తేల్చిచెప్పిన ప్రతిపక్షాలు  

కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే నివాసంలో ‘ఇండియా’కూటమి నేతల భేటీ  

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చ  

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులోని నియోజకవర్గాల పునర్వీభజన నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాయి. సంబంధిత బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత బిల్లు అని ఆరోపించారు. 

విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న విధానం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేసి బిల్లును నెగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

 గతంలో ఆమోదించిన సవరణ బిల్లును అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్‌ పేరిట డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌ వ్యవహారాన్ని వ్యతిరేకించాలని ఉమ్మడిగా నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్పష్టత లేని జనగణన, భవిష్యత్తు డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దని కోరారు. పార్లమెంట్‌ వద్ద ఉండాల్సిన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి కల్పిస్తూ, రాజకీయంగా అనుకూలమైనప్పుడల్లా నియోజకవర్గాలను మార్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మోసం చూశామని ఖర్గే తెలిపారు. అందుకే నియోజకవర్గాల పునర్వీభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు.  

అధికారం కోసమే ఈ కుతంత్రం: రాహుల్‌  
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును 2023లో పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డీలిమిటేషన్‌తో అధికారం దక్కించుకోవాలన్న కుతంత్రం తప్ప ఇందులో ఇంకేముందని ప్రశ్నించారు. విపక్షాల భేటీలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీల హక్కులను చోరీ చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే దక్షిణ, ఈశాన్య, వాయువ్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.  

ప్రమాదకరం: కె.సి.వేణుగోపాల్‌
మోదీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన చర్య ప్రమాదకరమైనదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా రాష్ట్రాలకు సమాన అధికారాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విపక్ష నేతల సమావేశంలో డీఎంకే నాయకుడు టి.ఆర్‌.బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు సాగరికా ఘోష్, శివసేన(ఉద్ధవ్‌) నాయకులు సంజయ్‌ రౌత్, అరవింద్‌ సావంత్, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్, స్వతంత్ర ఎంపీ కపిల్‌ సిబల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement