పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్‌ ..! ప్రముఖ బ్రాండ్లకు.. | 54 year old Charanjit Kaur supplies jute bags to top indianbrands | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్‌ ..! ప్రముఖ బ్రాండ్లకు..

Jun 5 2026 4:08 PM | Updated on Jun 5 2026 4:22 PM

54 year old Charanjit Kaur supplies jute bags to top indianbrands

ఒక సాధారణ నైపుణ్యంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా మారి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందామె. పరిమిత వనరులతో ప్రారంభించిన వ్యాపారం..చూస్తుండగానే నెమ్మదిగా వృద్ధి చెందడం ఒక ఎత్తైతే..ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలే వచ్చి కొనుగోలు చేసేలా పేరుగాంచడం మాములు విషయం కాదు. కేవలం ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన ఆమె చిన్న సాధారణ నైపుణ్యంతో ఉపాధి ఏర్పరుచుకుని ఉన్నతస్థాయికి ఎదగడమే గాక ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం విశేషం. మరి ఆ మహిళ స్ఫూర్తిదాయక కథేంటో చూద్దామా..!.

ఆ మహిళే లూధియానాలోని సమ్రాలా సమీపంలో ఉన్న భగవాన్‌పురా గ్రామానికి చెందిన 54 ఏళ్ల చరణ్‌జిత్ కౌర్. పుట్టిన దగ్గర నుంచి పేదరికంలో పెరిగిన ఆమెకు డబ్బు విలువ గురించి బాగా తెలుసు. ముఖ్యంగా ఉపాధి విలువేంటో బాగా తెలుసామెకు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదో ఒకటి చేయాలనుకుంది. అందుకోసం జనపనార సంచులను తయారు చేయడం నేర్చుకోవాలని అనుకుంది. మొదట్లో చరణ్‌జిత్‌కు మద్దతు లభించలేదు. 

అయినా సరే ఎలాగైనా నేర్చుకుని తీరాలన్న పట్టుదలతో కృషి విజ్ఞాన్ కేంద్ర (KVK) కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలలో చేరింది. అది ఆమెకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికే కాకుండా వ్యాపారం గురించి మరింతగా అవగాహన ఏర్పరుచుకోవడాని వీలు కల్పించింది. అలా చిన్నగా వ్యాపారం ప్రారంభించింది. అయితే మొదట్లో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఆర్డర్లు రాక ఇబ్బందిపడ్డది కూడా. అలా నెమ్మదిగా ఆర్డర్లు దక్కించుకుంటూ చిన్నగా మొదలైన వ్యాపారం కాస్తా సంస్థగా మారింది. 

అంతేగదు ఏకంగా టాటా, జోంటీ ఆగ్రో వంటి కంపెనీలు నుంచి ఆర్డర్లు అందుకునేలా పేరు సంపాదించించుకుంది. అలా తన వ్యాపారం ద్వారా నెలకు దగ్గర దగ్గర రూ. 50 వేలు వరకు సంపాదించుకునే రేంజ్‌కి వచ్చింది. సాధారణ ప్రజలు కూడా కొనుగోలు చేసే ధర, అనుకున్న సమయానికి ఆర్డర్‌ ఇచ్చేలా ఆమె నిబద్ధత వ్యాపారానికి కీలకంగా మారి ప్రముఖ కంపెనీల నుంచి ఆర్డర్లు అందుకునేందుకు దారితీసింది. మరోవైపు ఆమె తన ఆదాయంతో కుటుంబ పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు ఇచ్చే స్థాయికి వచ్చారామె. 

అంతేగాదు ఆమె జనపనారతో సంచులు ఎలా తయారు చేయాలో చెబుతూ..స్వయంగా డబ్బులు సంపాదించుకునే మార్గాల గురించి ఇతర మహిళలకు వివరిస్తుంటుంది. విదేశాల నుంచి వచ్చి మరి ఆమె తయారు చేసే జనపనార సంచులను కొనుగోలు చేస్తుంటారట. మన్నిక, వినియోగం ఆధారంగా కొన్ని జనపనార సంచులు అధిక ధర పలుకుతాయని చెప్పుకొచ్చింది చరణ్‌జిత్‌ కౌర్‌. ఈ కథలో ఆర్థిక ఇబ్బందులు, చదువు లేకపోవడం వంటి సమస్యలు ‍ప్రతిబంధకం కాదు..తనపై తనకు నమ్మకం ఉంటే..చిన్న నైపుణ్యంతో విజయం సాధించొచ్చు, కలలు నిజం చేసుకోవచ్చని నిరూపించింది చణ్‌జిత్‌ కౌర్‌.

(చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..)

 

Advertisement
 
Advertisement
Advertisement