ఆకర్షణీయమైన రంగుల్లో, వివిధ ఆకారాల్లో ఉండే అప్పడాలను పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అందుకని వారు అడిగిన వెంటనే కొనివ్వడమో, లేదంటే ఇంట్లోనే వేయించి ఇవ్వడమో చేస్తుంటారు. కానీ ఈ రంగుల అప్పడాలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయంటూ తమిళనాడు ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
అప్పడాలను సాధారణంగా మినప్పప్పు లేదా బియ్యప్పిండితో తయారు చేస్తారు. ఆలుగడ్డ స్టార్చ్, సగ్గుబియ్యంతో చేసే వడియాల కంటే ఇవి చాలా పల్చగా ఉంటాయి. అయితే, ఈ అప్పడాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం పిండిలో ఫుడ్–గ్రేడ్ రంగులను కలిపి, ఆపై ఉడికించి, ఆరబెట్టి తయారు చేస్తారు. ఇలాంటి రంగుల అప్పడాలను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా ఈ రసాయన రంగుల వల్ల పిల్లల్లో అలర్జీలు రావడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని తమిళనాడు ఆహార భద్రతా విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ రంగురంగుల పాపడ్‌కి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే మినప్పప్పు లేదా బియ్యప్పిండితో తయారుచేసిన సహజసిద్ధమైన అప్పడాలను వాడటం అందరి ఆరోగ్యానికి సురక్షితం.
(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..! కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి మరి..)


