ఇటీవల కాలంలో భార్యభర్తల సంబంధాలు ఎంత దారుణంగా వికృతంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని చూస్తే..మనసు కలిచివేస్తుంది కూడా. అలాంటి తరుణంగా ఈ ఇద్దరి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయ భేదం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏ సంబంధంలోనైనా..పొరపొచ్చాలు సహజం. కానీ ఈ ఆలుమగలు..మధ్య ఎదురైనా అత్యంత సాధారణ అభిప్రాయభేదం వాళ్లను వేరు చేయలేదు..కానీ వారి మధ్యమాటలను దూరం చేసింది. ఇరువురి మధ్య భౌతికంగా దూరం లేదు గానీ మానసికంగా కలిసి లేరు, మాటల్లేవ్. పాపం వాళ్లని కలిపేందుకు సిద్ధమయ్యాడు కూమారుడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా అంటే..
ఈ విచిత్ర ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దాదాపు దశాబ్దం క్రితం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుతమైన ప్రేమకథ. అసాధారణ మలుపుతో భావోద్వేగంగా ముగిసినా..ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. 2017లో, 18 ఏళ్ల యువకుడు హోక్కైడోలోని ఒక టెలివిజన్ షోకు అసాధారణమైన విజ్ఞప్తి చేశాడు. తన జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక కుటుంబ సమస్యకు సహాయం చేయమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు దాదాపుగా 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నప్పటికీ సరిగ్గా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదని అందువల్ల తాను మళ్లీ కలిపి చక్కగా మాట్లాడుకునేలా చేయాలనుకున్నట్లు తెలిపాడు.
అందుకోసం సదరు టెలివిజన్ షోన్‌ని సహాయం చేయమని అర్థిస్తాడు. అతడి పేరెంట్స్ ఓటో కటాయమా ( యామా, భార్య యూమి ఒకే ఇంట్లో ఉంటున్నా..రెండు దశాబ్దాలుగా ఇద్దరి మధ్య మాటల్లేవ్. ముగ్గురు పిల్లలను పెంచారు, కలిసే భోజనం చేశారు. అయినా ఒకరితో ఒకరు అర్థవంతంగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అంత నిశబ్ద వాతావరణం వెనుక ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం గానీ తీవ్రమైన ద్రోహం గానీ చోటు చేసుకోలేదు.
కానీ ఎందుకని ఇద్దరి మధ్య సైలన్స్ చోటు చేసుకుందంటే..పిల్లల పట్ల భార్య చూపిస్తున్న శ్రద్ధ చూసి అసూయతో కటాయామా మాట్లాడటం మానేశారట. యామీ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా..అతను కేవలం తల ఊపడం, అవును అని మాత్రమే స్పందించి ఊరుకునేవారట. ఈ పరిస్థితిని చూసి వాళ్ల చిన్న కుమారుడు వాళ్లను తిరిగి కలిపేందుకు టెలివిజన్ సాయం కోరాడు. ఆ కార్యక్రమం నిర్వాహాకులు ఆ దంపతులు మొదట డేట్‌కు వెళ్లిన పార్కులోనే కలుసుకునేలా ఏర్పాటు చేసింది.
ముగ్గురు పిల్లలు పేరెంట్స్‌ని దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల మౌనాన్ని వీడుతూ..కటాయమా తన భార్యతో ఇలా అన్నారు, "ఏదో తెలియని కారణం వల్ల మనం మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది. నువ్వు పిల్లల గురించి చాలా ఆందోళన చెందావు. యూమి, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలను భరించావు. నేను ఎందుకు మాట్లాడటం లేదో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పిల్లలను తనకంటే అత్యంత ప్రేమగా చూసుకోవడంతో అసూయపడ్డాను, అలిగాను. అందువల్ల మాట్లాడలేదు.
జరిగిపోయినా కాలాన్ని వెనక్కి తేలేను కానీ..మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టడం మాత్రం సాధ్యమే మరి మాట్లాడుకుందామా.. అని అతను అడగడంతో..ఆ షోని చూస్తున్నవాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఈ భావోద్వేగమైన పునః కలయిక నెట్టింట త్వరగా వైరల్ అయ్యి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. చాలా ఏళ్ల నిశబ్దం తర్వాత మళ్లీ కలవడానికి ఆ జంట చూపిన సుముఖతను చాలా మంది ప్రశంసించారు. అంతేగాదు ప్రస్తుతం మారుతున్న సంబంధాల ధోరుణుల కారణంగా ఈ దంపతుల కథ అందరి మనసులను తాకింది.
(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!)


