ధోల్‌పూర్: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని తక్రౌలీ గ్రామానికి చెందిన రాహుల్ అనే విద్యార్థి, చదువు నిమిత్తం ధోల్‌పూర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. గురువారం పాఠశాలలో ఒక తోటి విద్యార్థినితో రాహుల్‌కు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సదరు విద్యార్థిని రాహుల్ చర్మపు రంగును ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరుకున్న రాహుల్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మరుసటి రోజు కూడా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీ లోంచి చూడగా, రాహుల్ ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: జాతీయ అవార్డుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం!


