నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
భారతదేశంలో అనాది నుంచి కూడా భూమిని భూమాతగా కొలుస్తున్నారు. వృక్షా లను, పశువులను పూజిస్తున్నారు. అంటే భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ప్రకృతి– పర్యావరణం ఒక విడదీయలేని భాగం. మొక్కలు నాటడం, సహజ వనరులు వాడటంలో పొదుపు; వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత భారతీయ జీవన విధానంలో అంత ర్భాగంగా కొనసాగుతున్నాయి. అయితే ఆధునిక కాలం పోకడల కారణంగా మన జీవన శైలిలో కూడా మార్పులు వచ్చాయి. ఫలితంగా పంచభూతాలను కలుషితం చేస్తున్నాము. నిజానికి ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాలు మన శరీరం పంచభూతాత్మకం (భూమ్యాకాశాలు, గాలి, నీరు, అగ్ని) అని పేర్కొంటున్నాయి. ఈ పంచభూతాలను నాశనం చేస్తున్నామంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే కదా! అందుకే పర్యావరణంలో భాగమైన పంచభూతాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లే లెక్క.
ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, సునామి, భూకంపాలు వంటివి అన్నీ కూడా భూతాపం పెరిగి వాతావరణంలో అసమానతలు ఏర్పడి నందువలన వస్తున్నాయి. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా మానవుడు ప్రకృతిని విచక్షణా రహితంగా కొల్లగొట్టడమే. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని అధికం చేయడం కూడా మరో కారణం. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్ పదార్థాలను 2040 కల్లా 60 శాతానికి తగ్గించాలని పిలుపు ఇవ్వడం ఈ సదర్భంగా గమనార్హం. భూతాపానికి కారణమైన ఇంధనాల వినియోగాన్ని తగ్గించి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం వాడకాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఈ చర్యల ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, మన సంస్కృతిని కూడా రక్షించుకున్నట్లవుతుంది.
– ప్రొ. వై.వి. రామిరెడ్డి


