ప్రళయం వచ్చి పడింది.. మీరేం చేస్తారు?
అకౌంట్లో 30 నుంచి 45 లక్షలున్నాయా?
ఉంటే మీకిక భయం లేనట్లే..
సునామీలు ముంచెత్తినా.. భూకంపాలు భయపెట్టినా బిందాస్‌గా ఉండొచ్చు.. బుల్లెట్లు కాల్చినా.. బాంబులు పేల్చినా.. బాల్టీ తన్నేయకుండా బేఫికర్‌గా జీవించొచ్చు..
అది అవదమ్మ అంటారా.. అలా అవ్వాలంటే మీరా డబ్బులు ఖర్చు పెట్టి.. ముందు ఓ లైఫ్ పాడ్‌ను కొనాలి.. ఇంతకీ ఏంటిది?
యుద్ధ పరిస్థితులు, ఉగ్రదాడులు, వరదలు, సునామీలు, భూకంపాలు.. ఇలా ప్రకృతి లేదా మానవుడు సృష్టించిన ఉత్పాతాల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఫ్రాన్స్‌కు చెందిన మొమెంటం టెక్నాలజీస్ సంస్థ ‘లైఫ్ పాడ్’లను అభివృద్ధి చేసింది. వీటిని అత్యంత బలమైన లోహాలతో తయారుచేశారు. తరలించడం కూడా తేలిక. పైగా.. వివిధ రకాల విపత్తులకు అనుగుణంగా మూడు రకాల పాడ్‌లను రూపొందించారు.
డబ్ల్యూ–1
ఆకస్మిక వరదలు, ఆనకట్టలు తెగిపోవడం, సునామీలు వంటి వాటి కోసం తయారుచేశారు. ఇది తేలియాడే క్యాప్సూల్‌లాంటిది. ఇద్దరు నుంచి నలుగురు ఉండొచ్చు. నీళ్లలో వినియోగానికి అనుగుణంగా దీన్ని అత్యంత మన్నికైన అల్యూమినియంతో చేశారు. పెద్ద పెద్ద శిథిలాల్ని ఢీకొట్టినా తట్టుకుంటుంది. ప్రస్తుతం ఇది తుది దశలో ఉందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.38 నుంచి 45 లక్షల దాకా ఉండే అవకాశముంది.
బీ–1
ఉగ్రదాడులు లేదా ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించారు. ఇద్దరు ఉండొచ్చు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే దీని లోపలికి వెళ్లి లాక్ చేసుకునేలా తయారుచేశారు. పరిశ్రమలు, భద్రత దళాలు ఉండే ప్రాంతాల్లో వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ప్రొటోటైపు రెడీగా ఉంది. దీని ధర రూ.32 లక్షలు.
క్యూ–1
భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాల్లో ప్రాణాలకు కాపాడేందుకు దీన్ని తయారుచేశారు. ఇల్లు లేదా అపార్టుమెంటు నుంచి బయటకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ఇది రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చు. దీని ధర ఇంకా ప్రకటించలేదు. ఇటీవల పారిస్‌లో జరిగిన వివాటెక్ ప్రదర్శనలో ఈ మూడు లైఫ్ పాడ్‌లను కంపెనీ అధినేత సెడ్రిక్ ఆవిష్కరించారు.

అయితే ఇవన్నీ ఉన్నా.. ప్రాణాలు పోతేనో అని మూల‘శంక’ మాస్టారు ఒకరు డౌట్ రైజ్ చేశాడు..
అంతే.. సెడ్రిక్.. ఆ ఒక్క మాటతో లేచి.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ.......
– సాక్షి, సెంట్రల్ డెస్క్


