ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా? | Mumbai Muharram Juloos Heart Lungs Kidneys how can Zinc Phosphide Claim your Life | Sakshi
Sakshi News home page

ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా?

Jun 30 2026 7:37 AM | Updated on Jun 30 2026 8:45 AM

Mumbai Muharram Juloos Heart Lungs Kidneys how can Zinc Phosphide Claim your Life

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోగల బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ కుట్ర వెలుగుచూసింది. ఒళ్లు నొప్పుల నివారణా మాత్రలంటూ (పెయిన్ కిల్లర్స్) అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందు కెమికల్ ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్‌ను పంపిణీ చేయడం కలకలంరేపింది. అప్రమత్తమైన ముంబై పోలీసులు ఈ పెను ప్రమాదాన్ని అడ్డుకోగలిగారు. అసలు ఇంతకీ జింక్ ఫాస్ఫైడ్ అంటే ఏమిటి? ఇది శరీరంలోకి వెళ్తే ప్రాణాలు ఎలా పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చుంచులను చంపే మందు.. మనుషులకు మృత్యుపాశం
జింక్ ఫాస్ఫైడ్ అనేది ముదురు బూడిద రంగులో ఉండే ఒక అకర్బన రసాయన సమ్మేళనం (Inorganic Chemical Compound). దీనిని సాధారణంగా పొలాలు, గోదాములు, ఇళ్లలో ఎలుకలు, ఇతర హానికరమైన జంతువులను (Rodents) నిర్మూలించడానికి 'రోడెంటిసైడ్' (ఎలుకల మందు)  విరివిగా ఉపయోగిస్తారు. ఇది మానవుల ప్రాణాలకు క్షణాల్లో ముప్పు తెచ్చే గుణం కలిగి ఉన్నందున, దీని నిల్వ, బహిరంగ విక్రయాలపై చట్టపరంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ముంబైలో స్వాధీనం చేసుకున్న ప్రతి క్యాప్సూల్‌లోనూ దాదాపు ఒక గ్రాము చొప్పున ఈ ప్రాణాంతక జింక్ ఫాస్ఫైడ్‌ను నింపినట్లు నిర్ధారణ అయింది.

పొట్టలోకి వెళ్తే పొగబెట్టే ‘ఫాస్ఫైన్ గ్యాస్’
జింక్ ఫాస్ఫైడ్ ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే అది అత్యంత విషపూరితంగా మారుతుంది. ఈ రసాయనం మానవ జీర్ణాశయానికి చేరుకోగానే, అక్కడి జఠర రసం లేదా పొట్టలోని యాసిడ్‌లతో (Stomach Acid) రసాయన చర్య జరుపుతుంది. ఈ ప్రక్రియ వల్ల ‘ఫాస్ఫైన్ గ్యాస్’ (Phosphine Gas) విడుదలవుతుంది. ఈ గ్యాస్ మానవ శరీరానికి తీవ్రంగా హాని కలిగిస్తుంది. ఇది నేరుగా రక్తంలో కలిసి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), మెదడుపై తీవ్రమైన దాడి చేస్తుంది.

ఆక్సిజన్‌ను ఆపేసి.. అవయవాలను నిర్జీవం చేసి.. 
ఈ విషవాయువు ప్రభావం వల్ల శరీరంలోని కణాలు ఆక్సిజన్‌ను గ్రహించే, ఉపయోగించుకునే ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (irregular heartbeat) ఏర్పడతాయి. రక్తపోటు (Blood Pressure) ఒక్కసారిగా పడిపోతుంది. ఊపిరి తీసుకోవడం అత్యంత కష్టంగా మారుతుంది. విషం తీవ్రత పెరిగేకొద్దీ, శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విఫలమయ్యే ‘మల్టీ-ఆర్గన్ ఫెయిల్యూర్’ (Multi-organ failure) పరిస్థితి ఏర్పడి మనిషి మరణిస్తాడు. ఇందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు.

ప్రాథమిక లక్షణాలు ఇవే..
ఈ విషపూరిత కెమికల్ శరీరంలోకి వెళ్లిన వెంటనే కొన్ని హెచ్చరిక లక్షణాలు కనిపిస్తాయి. బాధితుడికి తీవ్రమైన వికారం, వాంతులు అవుతాయి. పొట్టలో భరించలేనంత నొప్పి మొదలవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, బాధితుడి నోటి నుంచి లేదా వాంతుల నుంచి ‘వెల్లుల్లి’ వంటి ఘాటైన వాసన వస్తుంది. దీంతో పాటు తల తిరగడం, విపరీతమైన నీరసం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అత్యవసర పరీక్షలు
జింక్ ఫాస్ఫైడ్ పాయిజనింగ్ జరిగినట్లు అనుమానం వస్తే, వైద్యులు తక్షణమే రోగి ప్రాణాలను రక్షించేందుకు పలు రకాల అత్యవసర పరీక్షలు చేస్తారు. ఇందులో భాగంగా రోగి బ్లడ్ ప్రెజర్ (బిపి), గుండె పనితీరును గమనిస్తారు. గుండె  కొట్టుకునే తీరును గమనించేందుకు ఈసీజీ తీస్తారు. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తనిఖీ చేస్తారు. వీటితో పాటు రసాయనం ఏ మేరకు ప్రభావం చూపిందో అంచనా వేయడానికి లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లతో పాటు ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తారు.

విరుగుడు లేని విషం
ఈ విషానికి సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. జింక్ ఫాస్ఫైడ్ పాయిజనింగ్‌కు ఎలాంటి నిర్దిష్ట ‘యాంటీడోట్’ (విరుగుడు మందు) అందుబాటులో లేదని నిపుణులు చెబుతున్నారు. దీనిని సేవించిన వ్యక్తిని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తరలించడం ఒక్కటే మార్గం. రోగికి కృత్రిమ శ్వాస కోసం ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. గుండె, రక్తపోటును అదుపులో ఉంచడానికి వైద్యులు లక్షణాత్మక చికిత్స (Symptomatic Treatment) అందిస్తారు. శరీరంలో విషం మరింతగా వ్యాపించకుండా ప్రాథమిక చికిత్సలు అందించి, ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. 

ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. బెంగాల్‌లో ‘యోగీ’ స్టయిల్‌ గుండా బిల్లు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement