సాక్షి, ఢిల్లీ: దేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయాలలో దేశ విభజన ఒకటని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆగస్టు 14 "విభజన భయానక స్మృతి దినం" సందర్భంగా ఎక్స్ ఖాతాలో విభజన దినోత్సవ విషాద స్మృతులను ఆయన పంచుకున్నారు. దేశ విభజన అంతులేని జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని, కుటుంబాలను నిర్వాసితులను చేసిందని అపారమైన మానవ వేదనకు కారణమైందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ప్రధాని ఎక్స్ ఖాతాలో "ఈరోజు మనం విభజన విషాధ స్మృతి దినాన్ని పాటిస్తున్నాము. విభజన కారణంగా ప్రభావితమైన ప్రతి ఒక్కరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకుంటున్నాము. ఇది అనేక జీవితాలను ఛిన్నభిన్నం చేసిన చారిత్రక క్షణం... కుటుంబాలు నిర్వాసితులయ్యాయి, ప్రియమైన వారిని కోల్పోయారు అపారమైన బాధను అనుభవించారు. " అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడిన వారి పట్టుదలను ఆ సందర్భంగా ఆయన కొనియాడారు.
ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ, చాలా మంది తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. "వారి జీవిత ప్రయాణాలు మానవ ఆత్మ యొక్క బలాన్ని మనకు గుర్తుచేస్తాయి. మన దేశంలో ఐక్యతను, సౌభాత్రాన్ని కాపాడుకోవాలనే మన సంకల్పాన్ని ఈ రోజు మరింతగా బలోపేతం చేయాలి. ఒక వికసిత్ భారత్‌ను నిర్మించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం" అని ఆయన జోడించారు.
కాగా విభజన బాధితులకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం నివాళులర్పించారు. భారతదేశ విభజన వల్ల జరిగిన అపారమైన మానవ వేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్న ప్రజల ధైర్యాన్ని మరియు పట్టుదలను ఆయన ప్రశంసించారు.
లక్షలో సంఖ్యలో మరణాలు
1947లో జరిగిన దేశ విభజన మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద విషాదకరమైన వలసలలో ఒకటి. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయింది. ఆ సమయంలో దాదాపు 1 కోటి 50 లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటారు. విభజన రేఖల వల్ల రెండు వైపులా తీవ్రమైన మతకల్లోలాలు జరిగాయి.
ప్రజలు తమ ఇళ్లు, భూములు, వ్యాపారాలను ఉన్నపళంగా వదిలి శరణార్థులుగా మారారు. రవాణాపై దాడులు శరణార్థులతో వెళ్తున్న రైళ్లు, బస్సులు నడిచి వెళ్తున్న కాన్వాయ్‌లపై దాడులు జరిగాయి. సుమారు 2 లక్షల నుండి 20 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా. లక్షలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి, ఏళ్ల తరబడి శరణార్థుల శిబిరాల్లో మగ్గిపోయారు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన ప్రజల త్యాగాల జ్ఞాపకార్థం 2021 నుండి ఏటా ఈ రోజును "విభజన భయానక స్మృతి దినం" గా జరుపుకుంటున్నారు.


