బంగారం మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన అన్నారు.
1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని కియోసాకి ప్రస్తావించారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినా, 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని అన్నారు. అంతకుముందు డాలర్ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని వివరించారు.
అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్ నిల్వలను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైతే హామీలు ఇస్తున్నారో.. వారే ఇప్పుడు ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు.
తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మెరుగైన వ్యూహమని ఆయన సూచించారు.
బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం, భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని కియోసాకి వివరించారు. ఈ సందర్భంగా ‘ది క్యాపిటల్ క్లబ్’ పేరుతో పెట్టుబడి అవకాశాలను అందించే సంస్థను, దాని ద్వారా బంగారం-వెండి మైనింగ్ ఆపరేషన్‌లో పెట్టుబడి అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.


