తళుక్కుమనే ‘హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్’.. ధర ఎంతంటే? | Hyundai Exter Knight edition launched at Rs 8 14 lakh | Sakshi
Sakshi News home page

తళుక్కుమనే ‘హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్’.. ధర ఎంతంటే?

Aug 12 2026 8:18 PM | Updated on Aug 12 2026 8:31 PM

Hyundai Exter Knight edition launched at Rs 8 14 lakh

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త 2026 ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్లాక్-థీమ్ డిజైన్, స్పోర్టీ రెడ్ యాక్సెంట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ మైక్రో ఎస్‌యూవీ ధర రూ.8.14 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. 2024లో తొలిసారి వచ్చిన ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చారు. కాగా, ఎక్స్‌టర్ ఇప్పటికే దేశంలో 2 లక్షలకు పైగా కస్టమర్లను చేరుకుంది.

కొత్త ఎక్స్‌టర్ నైట్‌లో ప్రధాన ఆకర్షణ దాని నలుపు రంగు స్టైలింగ్. ముందు, వెనుక భాగాల్లో మ్యాట్ బ్లాక్ ఎక్స్‌టర్, హ్యుందాయ్ లోగోలు, డార్క్ గ్రే బంపర్లు, సైడ్ సిల్ గార్నిష్‌లు ఉన్నాయి. 15 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌కు ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు జత చేశారు. ప్రత్యేకమైన ‘Knight’ ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఈ మార్పులతో సాధారణ ఎక్స్‌టర్‌తో పోలిస్తే వాహనానికి మరింత బోల్డ్, స్పోర్టీ లుక్‌ వచ్చింది.

క్యాబిన్‌లోనూ ఇదే డార్క్ థీమ్‌ను కొనసాగించారు. బ్రాస్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ప్రత్యేకమైన బ్లాక్ సెమీ-ఫ్యాబ్రిక్ సీట్లు, అంబర్ ఫుట్‌వెల్ లైటింగ్, బ్లాక్ డి-కట్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి. మొత్తంగా బయట నలుపు, లోపల నలుపు రంగుల కలయికకు స్పోర్టీ టచ్ ఇచ్చారు.

ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ 83 పీఎస్ పవర్, 113.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీ వెర్షన్‌లో 69 పీఎస్ పవర్, 95.2 ఎన్ఎం టార్క్ లభిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.

భద్రత విషయంలో 2026 ఎక్స్‌టర్‌కు 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. కొత్త ఎక్స్‌టర్‌లో డ్యాష్‌క్యామ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి టెక్నాలజీ ఫీచర్లను కూడా హ్యుందాయ్ అందిస్తోంది.

ధర విషయానికి వస్తే.. 2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.14 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఎక్స్‌టర్ నైట్ శ్రేణి ప్రధానంగా HX6లోని పెట్రోల్, సీఎన్‌జీ ఎంపికలతో పాటు HX10 పెట్రోల్-ఏఎంటీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. సాధారణ వేరియంట్‌పై నైట్ ఎడిషన్‌కు బ్లాక్ ఎక్స్‌టీరియర్, ప్రత్యేక ఇంటీరియర్ కోసం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి 2026లో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను అప్‌డేట్ చేసినప్పుడు దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.79 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్స్‌టర్ ధరలు వేరియంట్‌ను బట్టి మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement