3,718 యాప్‌లు బ్లాక్‌.. రూ.11,158 కోట్లు సేవ్‌! | Cyber Fraud Centre Blocks 3718 Apps Saves Rs 11,158 Crore | Sakshi
Sakshi News home page

3,718 యాప్‌లు బ్లాక్‌.. రూ.11,158 కోట్లు సేవ్‌!

Aug 12 2026 3:00 PM | Updated on Aug 12 2026 3:15 PM

Cyber Fraud Centre Blocks 3718 Apps Saves Rs 11,158 Crore

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గడిచిన జూన్ 30 నాటికి చట్టవిరుద్ధమైన, మోసపూరిత రుణ యాప్‌లతో సహా 3,718 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

రూ.11,158 కోట్ల నష్టం నివారణ

2021లో ప్రారంభమైన సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా ఇప్పటివరకు 32.80 లక్షలకు పైగా సైబర్ మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా తీసుకున్న చర్యలతో రూ.11,158 కోట్లకు పైగా మోసపూరిత నష్టాన్ని నివారించగలిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లపై చర్యలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69-ఎ, 79(3)(బి) కింద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చర్యలు చేపట్టింది. పోలీసు అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది.

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్‌ఎంఎస్‌లు, కాలర్ ట్యూన్లు, సోషల్ మీడియా, టెలివిజన్, రేడియోతో పాటు పాఠశాలలు, సినిమాలు, సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ప్రచార కార్యక్రమాలను కూడా ప్రభుత్వం వినియోగిస్తోంది.

మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’

బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో I4C 2024 సెప్టెంబర్‌లో ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి 30.48 లక్షలకు పైగా అనుమానిత ఐడెంటిఫైయర్లు, 32.08 లక్షలకు పైగా లేయర్-1 మ్యూల్ ఖాతాల వివరాలను సంబంధిత సంస్థలతో పంచుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా జూన్ 30, 2026 నాటికి రూ.25,698 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయగలిగినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మాడ్యూళ్లు

సైబర్ క్రైమ్ ఫిర్యాదులను ఏకరీతిగా నిర్వహించేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్-సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్ కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసింది. మోసపూరితంగా తరలించిన నిధుల రికవరీకి తోడ్పడటంతో పాటు స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలు, తాత్కాలిక లియన్ మార్క్‌లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ ఏప్రిల్ 2026లో ప్రారంభమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement