అధికారులకు షాక్‌.. కేంద్రం కొత్త రూల్‌ | One Officer One Car: Centres New Rule Sparks Change | Sakshi
Sakshi News home page

అధికారులకు షాక్‌.. కేంద్రం కొత్త రూల్‌

Jul 29 2026 7:18 AM | Updated on Jul 29 2026 7:25 AM

One Officer One Car: Centres New Rule Sparks Change

న్యూఢిల్లీ: ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒక అధికారి.. ఒక అధికారిక కారు’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిబంధనలను వెల్లడించింది.  దీనిపై కేం‍ద్ర వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. 

ఇకపై అదనపు బాధ్యతల పేరుతో సీనియర్‌ అధికారులకు మరో ప్రభుత్వ వాహనం కేటాయించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారిక కారుకు అర్హత ఉన్న ఓ అధికారి.. మరో మంత్రిత్వ శాఖ, విభాగం, ప్రభుత్వ రంగ సంస్థ (PSU) లేదంటే స్వయం ప్రతిపత్తి సంస్థకు అదనపు బాధ్యతలు నిర్వహించినా.. ప్రత్యేకంగా మరో వాహనం ఇవ్వకూడదని పేర్కొంది. అలాంటి అధికారులు తమకు ఇప్పటికే కేటాయించిన అధికారిక వాహనాన్నే అన్ని విధుల కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అధికారిక కార్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, అనవసర ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ రూల్‌ తెచ్చినట్లు చెబుతోంది.

కఠిన ఆంక్షలు ఇలా.. 
కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు లేదంటే ఇతర అర్ధ ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై కూడా ఆంక్షలు విధించింది. కేవలం అధికారిక విధులు, అనుమతించిన పర్యటనల సమయంలో మాత్రమే వాటిని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వినియోగంలో లేని లేదా అదనపు వాహనాలను సురక్షితంగా భద్రపరచాలని అన్ని శాఖలకు సూచించింది.

ప్రజాధనం ఆదా చేయడమే లక్ష్యం
ప్రభుత్వ వాహనాల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అనవసర వ్యయాలను నియంత్రించడం, ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఒకే అధికారి వద్ద పలు వాహనాలు ఉండటం వల్ల జరిగే దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు.. ప్రభుత్వ వనరుల వినియోగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది.

2022 మార్గదర్శకాలకు కొనసాగింపు
ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్రం 2022 సెప్టెంబర్‌లో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ శాఖల్లో అమల్లో ఉన్న నిబంధనలను ఒకే విధానంలోకి తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వులతో ఆ మార్గదర్శకాలను మరోసారి పునరుద్ఘాటించిన కేంద్రం.. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

వాహనాల నిర్వహణలో మారనున్న విధానం
ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే.. ఈ నిబంధన వారికి నేరుగా వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వాహన సదుపాయాలు వారి హోదా, సంబంధిత నిబంధనల ప్రకారం కొనసాగుతాయి. తాజా ఉత్తర్వులు మాత్రం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల వాహన వినియోగానికే వర్తిస్తాయి. కొత్త నిబంధనలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వాహనాల కేటాయింపు, వినియోగ విధానం మరింత కట్టుదిట్టం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement