న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. వచ్చే నాలుగైదు రోజుల్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో వాహనాలు, నివాసాలు మట్టి, బురద, రాళ్లకింద కూరుకుపోయాయి.
అయితే, ప్రాణనష్టం సంభవించలేదు. ఉత్తరాఖండ్‌లో విడవకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఛార్‌ధామ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు. యాత్ర మార్గంలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ సీజన్‌లో అత్యధికంగా మంగళవారం వర్షం నమోదైందని, మూడేళ్లలోనే జూలైలో 29 డిగ్రీల సెల్సియస్‌తో అతి చల్లని రోజుగా మంగళవారం ఉందని ఐఎండీ తెలిపింది.


