తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం నదురుబాద గ్రామంలో నీళ్లు లేక నెర్రెలిచ్చిన పొలం
వరి వేయొద్దంటూ తాపీగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం
ఖరీఫ్‌లో నమ్మించి నట్టేట ముంచిన బాబు సర్కారు..
ముందే తీవ్ర కరువు ముప్పు తప్పదన్న వాతావరణ శాఖ
అయినా పట్టించుకోకుండా ప్రచారార్భాటాలతో సాగునీటి షెడ్యూల్ విడుదల
పెన్నా నుంచి పట్టిసీమ వరకు నీటి విడుదల పేరిట ప్రభుత్వం షో
దుక్కి దున్ని.. నారు పోసి.. నాట్లు వేసి.. ఎరువులు కూడా కొనుగోలు చేశాక ఇప్పుడు నీళ్లు ఇవ్వనంటే ఎలా?
తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
ఇప్పటికే ఎకరాకు రూ.15 వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు
కీలక దశలో వరికి సాగునీరందక పడరాని పాట్లు
బాబు సర్కారు దోబూచులాట ఆడకుండా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
సాక్షి, అమరావతి: నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబును మించిన వారుండరని మరోసారి రుజుౖవైంది! గతేడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగు నీరందించాం.. ఈ ఏడాది అంతకు మించి ఇస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించింది. ముందస్తుగా సాగునీరు విడుదల చేస్తున్నాం... ఖరీఫ్‌లో వరి సాగుకు ఢోకా ఉండదన్న సర్కారు ఇప్పుడు తూచ్ వరి పంటకు సాగు నీరివ్వలేమనడంతో రైతన్నలు హతాశులయ్యారు. దుక్కి దున్ని.. నారుపోసి.. నాట్లు వేశాక.. ఎరువులు కూడా కొన్నాక ఇçప్పుడు నీళ్లు ఇవ్వనంటే ఎలా అని రైతులు మండిపడుతున్నారు. దీంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన వారంతా ఆదిలోనే నిలువునా మోసపోయి దిక్కులు చూస్తున్నారు. తీవ్ర కరువు తప్పదంటూ వాతావరణ శాఖ ఆర్నెల్లుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా సాగునీటి షెడ్యూల్ ప్రకటించింది.
పెన్నా నుంచి పట్టిసీమ వరకు సాగునీటి విడుదల పేరిట ఫోటోలకు ఫోజులిస్తూ రైతుల్లో ఆశలు రేపింది. సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో భూమిని దున్ని, ఎరువులు వేసి, వరినాట్లు వేసి సాగు చేస్తున్న తరుణంలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం దారుణమని రైతులు ఆక్రోశిస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి.. అప్పులు చేసి నాట్లు వేస్తే సాగునీరివ్వలేమని సర్కారు తాపీగా చెప్పడంతో నెర్రలు చాస్తున్న పంట పొలాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి అప్పులు చేసి నాట్లు వేసిన రైతన్నలు పంటను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక వైఫల్యం కారణంగా తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చంద్రబాబు విజనరీ ఇదేనా? అంటూ మండిపడుతున్నారు.
నమ్మించి ముంచేశారు..
ఖరీఫ్ సన్నద్ధత పేరిట మే 18న వ్యవసాయ–ఇరిగేషన్ శాఖల సమన్వయ సమావేశంలో సాగునీటి విడుదల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 1 నుంచే కాలువలకు నీరు ఇస్తామని, ఖరీఫ్‌కు ఇబ్బంది ఉండదని వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు నమ్మకంగా చెప్పారు. పెన్నా, కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు ఇటీవలే పట్టిసీమకు నీళ్లు వదిలారు. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగుకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరం. ఈసారి 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించి జూలై 1న ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసింది.
ప్రభుత్వం చేసిన ఈ ప్రచారార్భాటాలను నమ్మి రైతులు నాట్లు పూర్తి చేశారు. తీరా పంట వెదకొచ్చే సమయంలో సాగునీరు అందక పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో వరి పంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీరు ఇవ్వలేమని ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎకరాకు రూ.15 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు. దీనికి రైతుల శ్రమ అదనం. ఈ తరుణంలో తాగునీటి అవసరాలకు మినహా డెల్టాలో పంటలకు సాగునీరు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో రైతులు నివ్వెరపోతున్నారు.
కళ్లెదుటే ఎండిపోతున్న పంటలు
గడువులోగా కాలువల పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు పూర్తి కాకపోవడంతో గోదావరి, కృష్ణా డెల్టాలో సాగునీరు సరిగా చేరలేదు. కాలువలపై ఆధారపడి సాగు చేసిన వేలాది ఎకరాల్లో వరి నాట్లు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయం లేక రైతులు నిస్సహాయంగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆకు మడులు, వెద సాగు ఎండిపోతుండగా పొలాలు బీడు వారుతున్నాయి. అటు గోదావరి డెల్టా కింద కోనసీమలోనూ ఇటు కృష్ణా డెల్టా కింద దివిసీమలోనూ పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ హామీలను నమ్మి అప్పులు చేసి సాగు ప్రారంభిస్తే ఇప్పుడు కళ్లెదుటే పంటలు ఎండిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముందుగానే కరువు పరిస్థితులు తెలిసినా వాస్తవాలను కప్పిపుచ్చుతూ డెల్టాకు ఢోకా లేదంటూ ఖరీఫ్ సాగుకు ప్రోత్సహించడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు మండిపడుతున్నారు. ‘సాగు చేయండి..’ అన్న ప్రభుత్వం ఇప్పుడు ‘నీళ్లు లేవు..‘ అంటుండటంతో డెల్టా రైతులకు దిక్కు తోచడం లేదు.
నీరందక.. పంటను వదిలేస్తున్న రైతన్న
సర్కారు తీరుతో అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతం. సాగు సమయం దాటిన తరువాత పంట చేతికి సక్రమంగా వస్తుందా రాదా? అనే సందేహాలు నడుమ పంట వేయడం కంటే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చును వదిలేసుకోవడం మేలనే దిశగా అన్నదాతలు అడుగులు ముందుకు వేస్తున్నారు. మరికొందరు వేసిన పంటను ఎలాగైనా కాపాడుకుందామని ఆరాటపడుతున్నా రానున్న రోజుల్లో నీరందకపోతే పెట్టిన ఖర్చు వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని దుస్థితి ఈ ఖరీఫ్‌లో చూస్తున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటకు సకాలంలో నీరందక ఎండిపోతుండటం, సమయం మించిపోవడంతో రైతులు వేసిన పంటలను వదిలేసి కూలీ పనులకు గ్రామాలను వదిలి వెళ్లిపోతున్నారు.
తక్కువ సమయంలో పండే రకాలను వేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తుండటంతో మరికొందరు ఇప్పటికే వేసిన పంటలను మళ్లీ దుక్కిదున్ని నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాగునీరు అందే పరిస్థితి కానరావడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు వెదజల్లిన పంటలకు నీరందక ఎండిపోవడంతో వలస కూలీలుగా మారి పనులకు వెళ్తున్నారు. నీరందక శ్రీకాకుళం జిల్లా వంశధార ఆయకట్టు చివరి పొలాలు ఎండిపోతున్నాయి. వరి నారుమడులు బీడు వారిపోతున్నాయి.
నీరు లేక పంట ఎండిపోతోంది..
నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. ఈదుమూడిలో సొంతంగా ఎకరంన్నర పొలం ఉంది. చుక్క నీరు అందడం లేదు. లజ్జబండ డ్రయిన్ పక్కనే ఉంది. ఉప్పునీరు ఎదురు తన్నుతోంది. పెడనలో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుంటే ఇక్కడ కూడా నీరందని పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. పంట వదులుకుందామా అంటే ప్రాణం ఒప్పుకోవడం లేదు. నష్టపోయినా చేయాల్సిందేనన్నట్లుగా వ్యవసాయం చేస్తున్నా. పట్టిసీమ నుంచి నీరొచ్చేస్తోందంటున్నారు. ఇక్కడేమో నీరందని దుస్థితి.
– పామర్తి వీరాంజనేయులు, ఈదుమూడి, పెడన మండలం, కృష్ణా జిల్లా
రైతులకు పరిహారం ఇవ్వాలి
ముంజులూరులో ఎకరంన్నర ఉంది. అక్కడ నీరందని పరిస్థితి. పెడనలో ఎకరంన్నర కౌలుకు తీసుకుని చేస్తున్నా. మళ్లీ దుక్కి దున్ని పంట వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సాగునీరు విషయంలో పాలకులు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. దోబూచులాటలు ఆడకుండా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి.
– కూనపురెడ్డి సుబ్రమణ్యం, ముంజులూరు, కృష్ణా జిల్లా
రెండు ఎకరాల పంట వదిలేశా
ముంజులూరులో వెదసాగులో రెండు ఎకరాల పొలం చేస్తున్నా. మొలకలు వచ్చిన తరువాత నీరందని పరిస్థితి. నీటిని ఇంజన్లతో తోడుదామంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీనికంటే పంటను వదిలేసుకోవడం మేలని భావించి కూలి పనులకు పోతున్నా.
– గురజ సారథి, బంటుమిల్లి, కృష్ణా జిల్లా
కూలీ పనులకు పోతున్నాం
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. పంట పండించుకుందామని ఎంతో ఆశ పడ్డా. తీరా మొలకలు వచ్చిన తరువాత నీరందని దుస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదు. నీళ్లు తోడి నారు బతికించుకుందామంటే భరించలేని ఖర్చు. గుడ్లవల్లేరు మండలంలో కూలీ పనులకు వెళుతున్నాం. నాతో పాటు చాలా మంది వస్తున్నారు.
– బత్తుల వెంకన్న, ముంజులూరు, కృష్ణా జిల్లా
సాగు నీరిస్తామని చేతులెత్తేశారు...
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశా. నారుమడి, దుక్కులు, వరినాట్లకు ఎకరాకు రూ.13 వేలు ఖర్చు అయింది. వరి నాట్లను బతికించుకోవడానికి ఆయిల్ ఇంజన్ ద్వారా ఎకరాకు రూ.2 వేలు ఖర్చు పెట్టా. కాలువలకు పూర్తిస్థాయిలో నీరు రాక పొలాలు నెర్రలిస్తున్నాయి. సాగు నీరిస్తామని ముందుగా చెప్పి ఇప్పుడు చేతులెత్తేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.
– కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన, కృష్ణా జిల్లా


