‘స్థానిక’ ఎన్నికలు ప్రతిష్టాత్మకం | YS Jagan meets party leaders from Amalapuram Parliament constituency | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలు ప్రతిష్టాత్మకం

Jul 24 2026 5:01 AM | Updated on Jul 24 2026 5:01 AM

YS Jagan meets party leaders from Amalapuram Parliament constituency

అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

నాలుగు నెలల పాటు కో–ఆర్డినేటర్లు, గ్రామ, వార్డు పర్యటనలు చేయండి

ఈ సమావేశాల్లో పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డుల పంపిణీ  

ప్రజా సమస్యలపై గళం విప్పాలి 

క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి 

ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ పోటీ చేసి గెలవాల్సిందే 

ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు 

అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ నేతలతో భేటీలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, అమరావతి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావించి  పార్టీ శ్రేణులు వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బరిలోకి దించి.. విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ  పార్టీ ముఖ్య నాయకులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మితో పాటు అమలాపురం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు. 

తొలుత జిల్లా ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించిన వైఎస్‌ జగన్‌.. అనంతరం ఒక్కో నియోజకవర్గ సమన్వయకర్తతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్‌ కార్యాచరణపై సమగ్రంగా సమీక్షించారు. 

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి.. 
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనవని, వాటిని ప్రతి నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి స్థానంలో పార్టీ పోటీచేసి విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, అందుకు అనుగుణంగా కేడర్‌ను సన్నద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్య నాయకులంతా ఇప్పటి నుంచే పూర్తి బాధ్యత తీసుకుని గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలన్నారు. 

ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు, నాలుగు నెలల పాటు కోఆర్డినేటర్స్‌ గ్రామ, వార్డు పర్యటనలు, ఈ సమావేశాల్లోనే పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డుల పంపిణీ చేపట్టి ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ గళం విప్పాలని నాయకులకు మార్గనిర్దేశం చేశారు. కమిటీల వెరిఫికేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నాయకులను ఆదేశించారు. కమిటీల్లో ఉత్సాహవంతులు, చురుకైన నాయకులు, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసేవారంతా ఉండి గుర్తింపు కార్డుల పంపిణీకి అన్ని గ్రామాలకు వెళ్లి  సమావేశాలు నిర్వహించాలన్నారు. 

నాలుగు నెలల పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు గ్రామాలు, వార్డులలో పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడంతో పాటు ప్రజాసమస్యలపై గళం వినిపించాలని సూచించారు. అనుబంధ విభాగాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్టమైన నెట్‌వర్క్‌ సిద్ధమైందని చెప్పారు. ఆయా విభాగాల్లో చురుగ్గా పనిచేస్తున్న నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు కూడా తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎక్కువ సమయం వెచ్చించి సమన్వయకర్తలు, స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. 

ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించాలి.. 
ప్రతి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలన్నారు. ఇదంతా పార్టీ కేడర్‌కు, ప్రజలకు వివరించాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పార్టీ శ్రేణులకు వివరించాలని సూచించారు. స్థానిక నాయకత్వం ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి అండగా నిలవాలని స్పష్టం చేశారు. 

‘సర్‌’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి.. 
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత కూడా పార్టీ నాయకులు, బూత్‌ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ సూచించారు. ముసాయిదా జాబితా విడుదలతోనే ప్రక్రియ పూర్తయినట్లు భావించకూడదన్నారు. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే లేవనెత్తి పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే ఫారం–6 ద్వారా చేరి్పంచాలని, అనర్హుల పేర్లపై ఫారం–7 ద్వారా అభ్యంతరాలు తెలియజేయాలని, వివరాల్లో మార్పులు, సవరణల కోసం ఫారం–8ను ఉపయోగించాలని సూచించారు. ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.   

ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి..
రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షం గొంతు నొక్కడం, అక్రమ కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులకు పాల్పడటంపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందన్న సందేశం ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబానికి చేరాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, బాధితులకు అండగా నిలుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నాయకులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement