సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్సీపీ పోటీ చేసి గెలవాల్సిందేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ రోజు (గురువారం)కోనసీమకు చెందిన పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ ఎన్నికలను కార్యకర్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని విజయమే లక్షంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకు అనుగుణంగా క్యాడర్‌ను సన్నద్ధం చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల అంశమై పార్టీ ముఖ్యనాయకులంతా పూర్తి బాధ్యత తీసుకోవాలని గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలన్నారు. పార్టీ కమిటీలకు ఆగస్టు 15 నుండి గుర్తింపు కార్డుల పంపిణీ జరిపి కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. కమిటీలో ఉత్సాహవంతులు, చురుకైన నాయకులను తీసుకోవాలని నేతలకు సూచించారు.
అనుబంధ విభాగాల ద్వారా పార్టీకి పటిష్ఠమైన నెట్‌వర్క్ ఏర్పడిందని కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో క్షేత్రస్థాయి సమస్యలను పార్టీ క్యాడర్‌కు వివరించాలని ప్రజలకు, కార్యకర్తలకు స్థానిక నాయకత్వం అందుబాటులో ఉండాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి అండగా నిలవాలన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కూడా పార్టీ నాయకులు బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముసాయిదా జాబితా విడుదలతోనే ప్రక్రియ పూర్తయినట్లు భావించకూడదన్నారు. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే సమస్య లేవనెత్తి పరిష్కరించాలని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే ఫారం-6 ద్వారా చేర్చించాలన్నారు.
అనర్హుల పేర్లపై ఫారం-7 ద్వారా అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేసే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని సందేశం ప్రతి కార్యకర్తకు వెళ్లాలని వైఎస్ జగన్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.


