అత్యాచారానికి పాల్పడిన వారికి అండగా నిలిచారు
రాహుల్ గాంధీ మండిపాటు
న్యూఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రల్హాద్ జోషీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అత్యాచారానికి పాల్పడిన వారికి అండగా నిలిచే వ్యక్తి, నీచమైన వ్యక్తి అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని విద్యా శాఖ మంత్రిగా నియమించడం ఏమిటని ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ ధ్వజమెత్తారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.
ప్రధానమంత్రి తన మంత్రివర్గంలోని ఎవరినైనా విద్యాశాఖ మంత్రిగా ఎంపిక చేసుకుని ఉండొచ్చు కానీ ‘అత్యాచారానికి పాల్పడిన వారిని రక్షించే’ వ్యక్తిని ఎంపిక చేసుకోవడం విచిత్రంగా ఉందని చెప్పారు. ‘‘ప్రల్హాద్ జోషీ అత్యంత నీచమైన వ్యక్తి. అత్యాచారానికి పాల్పడేవారికి రక్షణ అవసరమని చెప్పే వ్యక్తి కంటే నీచమైనవాడు మరొకరు ఉండరు. ఆయనే నేడు విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి తీరు సరైంది కాదు. మంత్రివర్గంలో చాలామంది ఉండగా, వారిని కాదని ప్రల్హాద్ జోషీని ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన వారితో ప్రల్హాద్ జోషీ కలిసి ఉన్న పాత వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.


