పేపర్‌ లీక్‌ బిల్లు చరిత్రాత్మకం | Jitendra Singh moves anti-paper leak Bill in Lok Sabha | Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్‌ బిల్లు చరిత్రాత్మకం

Jul 29 2026 4:26 AM | Updated on Jul 29 2026 4:26 AM

Jitendra Singh moves anti-paper leak Bill in Lok Sabha

అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసింది  

చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది  

విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనం  

లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ స్పష్టికరణ

‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) 

సవరణ బిల్లు–2026’పై లోక్‌సభలో చర్చ ప్రారంభం  

విద్యార్థులపై లాఠీచార్జి పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాల డిమాండ్‌  

బుధవారానికి వాయిదా పడిన చర్చ  

న్యూఢిల్లీ: పేపర్‌ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026’చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ బిల్లు విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్‌ చర్చకు శ్రీకారం చుట్టారు.

ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల భారీ జరిమానా వంటి కఠినమైన శిక్షలు విధించేలా ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026’ను రూపొందించిన సంగతి తెలిసిందే. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. నిరసన వ్యక్తంచేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమరి్థంచారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పేపర్‌ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తుండడం కీలక పరిణామం అని వెల్లడించారు. అనంతరం చర్చ బుధవారానికి వాయిదా పడింది. 

విపక్ష సభ్యులది రాజకీయ ప్రసంగం: రిజిజు  
ప్రతిపక్షాలు పేపర్‌ లీక్‌ నిరోధక బిల్లు గురించి కాకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు విమర్శించారు. మొత్తం చర్చ బిల్లు యోగ్యతపై కేంద్రీకృతమై ఉండాల్సిందని అన్నారు. ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు బిల్లు గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయాలు చేశారని అన్నారు. అందరూ రాజకీయ ప్రసంగాలు చేశారని ఆక్షేపించారు. సభలో ఇలా చేయడం సరైంది కాదన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement