ఇలాగైతే త్వరలోనే భారీ నిరసనతో స్పందిస్తాం: అభిజీత్‌ దీప్కే | Abhijeet Dipke The Govt must stop targeting and witch hunting students | Sakshi
Sakshi News home page

ఇలాగైతే త్వరలోనే భారీ నిరసనతో స్పందిస్తాం: అభిజీత్‌ దీప్కే

Jul 28 2026 9:50 PM | Updated on Jul 28 2026 9:54 PM

Abhijeet Dipke The Govt must stop targeting and witch hunting students

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన భారీ నిరసన తర్వాత ప్రభుత్వం విద్యార్థులపై తీసుకుంటున్న చర్యలు, జరుగుతున్న పరిణామాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందించారు. ‘‘విద్యార్థులను పోలీసులు వేధించడం కొనసాగితే, కాక్రోచ్ జనతా పార్టీ త్వరలో భారీ శాంతియుత నిరసనతో స్పందిస్తుంది. ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం, వేధింపుల వేట కొనసాగించడాన్ని వెంటనే ఆపాలి’’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరోవైపు, తమ పోరాటం ఇంకా పూర్తికాలేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు స్పష్టం చేశారు. ఆందోళన విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్టుకాదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇ‍ంతకుముందే తెలిపారు.సీజేపీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఈ నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని పేర్కొన్నారు.

కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే.. 
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను విమర్శించారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎక్స్‌లో చేసిన పోస్టులో సౌరవ్ దాస్ స్పందిస్తూ... ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించకుండా ఉండేందుకు సాకుగా ఉపయోగించే అవకాశం ఉందని అన్నారు. నిరసనకారులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవడం సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటని గుర్తుచేశారు.

అస్సాం, బిహార్ వంటి ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు కేంద్రం సీజేపీకి ఇచ్చిన హామీని గౌరవిస్తూ ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కోర్టు పోలీసు చర్యలు కొనసాగించాలని ఎక్కడా ఆదేశించలేదని చెప్పారు. మంగళవారాన్నే ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు గడువుగా పేర్కొంటూ, డిమాండ్ నెరవేరకపోతే సీజేపీ మళ్లీ ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

జూలై 25న కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించుకోవాలని, శాంతియుత ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ లక్ష్యంగా చేసుకోబోమని చెప్పిందని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఆ హామీకి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్రం తరఫున వాదించిన న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీ ఆధారంగానే సీజేపీ దేశవ్యాప్త నిరసనను విరమించుకుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement