లాఠీచార్జి, పెల్లెట్ గన్స్ వాడాలని మీరే అనుమతిచ్చారా?
లేఖలో హోంమంత్రి అమిత్‌షాను నిలదీసిన రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచ్చింది మీరేనా? అని హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పాలని దేశ ప్రజల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయని రాహుల్ చెప్పారు.
విద్యార్థులపై పాశవికంగా జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం అమిత్ షాకు రాహుల్ ఒక లేఖ రాశారు. ‘‘జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. విద్యార్థులు న్యాయమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుతూ ఆందోళన నిర్వహించారు. వారి డిమాండ్లను వినాల్సిన ప్రభుత్వం, పోలీసులతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వినియోగం వంటి తీవ్ర బలప్రయోగానికి పాల్పడింది.
విద్యార్థినులతో కొందరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసుల దమనకాండలో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెల్లెట్స్ తగిలి గాయపడిన, ఒక కంట్లో చూపును కోల్పోయే ప్రమాదంలో పడిన టీనేజీ విద్యార్థి సాహిల్ లోచబ్‌ను కలిశా. ఒక జర్నలిస్టు సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలొచ్చాయి.
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడాలని మీరే అనుమతి ఇచ్చారా? ఇవ్వకపోతే ఎవరు ఆదేశించారు? సాధారణ దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు పోలీసులా లేదా వలంటీర్లా? వారికి అక్కడ విధులను అప్పగించింది ఎవరు?’’ అని అమిత్‌షాను రాహుల్ నిలదీశారు. ‘‘విద్యార్థులపై జరిగిన హింస ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. యువత దేశ భవిష్యత్తు. వారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’’ అని రాహుల్ ఆ లేఖ ద్వారా డిమాండ్‌చేశారు.


