హరియాణాలో వైద్య కళాశాలలో డాక్టర్ల నిర్వాకం
గురుగ్రామ్: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అని సామెత. హరియాణాలో ఈ వైద్యులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ డాక్టర్లు ఏం చేశారంటే.. బాలునికి ఓ కాలుకు సమస్య ఉందని వెళ్తే మరో కాలుకి శస్త్ర చికిత్స చేశారు. నూహ్ జిల్లాలోని నల్హార్‌లో షహీద్ హసన్ ఖాన్ మేవాతి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ఈ ఘటన వైద్యుల నిర్లక్ష్యాన్ని మరోసారి వెలుగులోకి తెచి్చంది. ఆరిఫ్ తన నాలుగేళ్ల బాలుడి ఎడమ కాలులో కణితి చికిత్స కోసం జూలై 20న వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. చూసిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అలాగే, బాలుడి కాలికి శస్త్రచికిత్స చేశారు.
చికిత్స అనంతరం బయటికి తీసుకురాగానే కుడి కాలికి శస్త్రచికిత్స జరిగిందని ఆరిఫ్ గుర్తించాడు. ఎడమకాలికి చేయాల్సి ఉండగా కుడి కాలుకు చికిత్స చేశారని డాక్టర్ల నిర్లక్ష్యాన్ని తెలియ జేశాడు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌ను చూసిన ఆర్థోపెడిక్ సర్జన్ తన పొరపాటును అంగీకరించి, ఆ తర్వాత మరో కాలికి సైతం శస్త్రచికిత్స చేశాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైద్య కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు వైద్య కళాశాల డైరెక్టర్ నలుగురు వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.


