హరిత రవాణా దిశగా ముందడుగు | PM Narendra Modi launches India first hydrogen train in Haryana | Sakshi
Sakshi News home page

హరిత రవాణా దిశగా ముందడుగు

Jul 18 2026 5:21 AM | Updated on Jul 18 2026 5:21 AM

PM Narendra Modi launches India first hydrogen train in Haryana

దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్‌ పవర్డ్‌ రైలు ప్రారంభం  

‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఇది విజయవంతమైన ఉదాహరణ

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ

జింద్‌/జలంధర్‌: దేశంలో హైడ్రోజన్‌ ఆధారిత రైలును ప్రారంభించుకోవడం హరిత రవాణా దిశగా కీలకమైన ముందడుగు, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఒక విజయవంతమైన ఉదాహరణగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌లో మొట్టమొదటి హైడ్రోజన్‌ పవర్డ్‌ రైలును ఆయన శుక్రవారం హరియాణాలోని జింద్‌ స్టేషన్‌లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జింద్‌–సోనిపట్‌ మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. 

ప్రపంచంలో హైడ్రోజన్‌ ఇంధన రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. మోదీ హరియాణాలో రూ.14,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. హైడ్రోజన్‌ రైలు ఆత్మనిర్భర్‌ భారత్, ఆధునిక రవాణా వ్యవస్థ పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. 

గతంలోని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల తలెత్తిన పరిస్థితులు ఒకవేళ 2014కు ముందే ఏర్పడి ఉంటే భారతీయ రైల్వేల కార్యకలాపాలు స్తంభించిపోయేవని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు ప్రధానంగా డీజిల్‌తో నడిచేవని గుర్తుచేశారు. అప్పట్లో డీజిల్‌ సరఫరాకు అంతరాయం కలిగి ఉంటే డీజిల్‌ ఆధారిత రైళ్లు ఆగిపోయేవని పేర్కొన్నారు.

 దేశం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చెప్పారు. కానీ, ఇది 2014 నాటి పరిస్థితి కాదన్నారు. ‘‘సమస్యలకు పరిష్కారాలను ముందుగానే ఆలోచించి, వాటిని క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే వ్యక్తి మోదీ. పశి్చమాసియా నేడు రణరంగంగా మారింది. హార్మూజ్‌ జలసంధి పరిసర ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం, చమురు సంక్షోభం ఉన్నప్పటికీ భారత రైల్వేలు, దేశ అభివృద్ధి పరుగు మాత్రం ఆగిపోలేదు’’అని వ్యాఖ్యానించారు.  

అత్యంత పొడవైన రైలు  
‘‘హైడ్రోజన్‌ ఆధారిత రైళ్లను నడిపే సామర్థ్యం కేవలం మూడు లేదా నాలుగు దేశాలకు మాత్రమే ఉంది. 21వ శతాబ్దపు ఈ సాంకేతికత విషయంలో భారతీయ రైల్వే ఒక పెద్ద ముందడుగు వేసింది. ఈ రైలు 3,200 హార్స్‌పవర్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదే కాకుండా అత్యంత పొడవైనది(10 కోచ్‌లు) కూడా. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో హైడ్రోజన్‌ రైలుకు కేవలం మూడు లేదా నాలుగు కోచ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, మన దేశంలో ఈ రైలుకు 10 కోచ్‌లు ఉన్నాయి. ఈ భారీ హైడ్రోజన్‌ రైలును నడపడం ద్వారా భారత్‌ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. భవిష్యత్తులో హైడ్రోజన్‌ రైలుకు సంబంధించిన మరిన్ని మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి. 

కురుక్షేత్రలో సిక్కు మ్యూజియం  
జింద్‌ పట్టణంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయం. స్వచ్ఛతను ప్రజలు తమ జీవన విధానంలో, దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చుకోవాలి. జింద్‌ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇది మహారాజా రంజిత్‌ సింగ్‌ కీర్తితోనూ, పాండవులకు సంబంధించిన విశ్వాసంతోనూ ముడిపడి ఉన్న ప్రాంతం. ఈ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, దానిని గర్వంగా భావి తరాలకు అందించడానికి భారత్‌ కట్టుబడి ఉంది. ఇదే స్ఫూర్తితో కురుక్షేత్రలో ఈ రోజు ఒక సిక్కు మ్యూజియంకు శంకుస్థాపన చేశాం. ఈ కొత్త మ్యూజియం హరియాణా సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది’’అని మోదీ ఉద్ఘాటించారు.  

అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం  
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వేర్వేరు రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. కేరళలో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ఆరు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో 13 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ‘వికసిత్‌ భారత్‌’దిశగా సాగే ప్రయాణంలో భవిష్యత్తుకు సంబంధించిన సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుత తరానికే కాకుండా, రాబోయే తరాలకు కూడా మేలు చేకూర్చే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. మోదీ శుక్రవారం పంజాబ్‌లో పర్యటించారు. రూ.5,470 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.

పంజాబ్‌లో అరాచక పాలన  
పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పారీ్ట(ఆప్‌) ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వానికి స్వచ్ఛమైన ఉద్దేశాలు గానీ, నిజాయితీ గానీ లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, కనీసం పోలీస్‌ స్టేషన్లు కూడా సురక్షితంగా లేవని ఆరోపించారు. ఇది ‘ఖట్టర్‌ బీమాన్‌ సర్కార్‌’అని విమర్శించారు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎప్పుడు, ఎక్కడ ముఠా పోరు చెలరేగుతుందో, ఏ దిశ నుంచి తూటాలు దూసుకొస్తాయో ఎవరూ ఊహించలేరని ఆందోళన వ్యక్తంచేశారు. జలంధర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో బహిరంగంగానే బలవంతపు వసూళ్లు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఎవరికీ రక్షణ లేదన్నారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నిజమైన మార్పును తీసుకురావడంతోపాటు అభివృద్ధి చెందిన, సంపన్నమైన పంజాబ్‌ను నిర్మించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మోదీ తేల్చిచెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement