breaking news
Jind district
-
గ్యాంగ్ రేప్ బాధితురాలిని పెళ్లాడిన రైతు
చండీగఢ్: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో వార్తల్లో ఉండే హర్యానాలో ఓ సానుకూల కథనం వెలుగు చూసింది. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు. 'నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ'ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
జింద్: హర్యానాలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురయింది. జింద్ జిల్లా రాజానా కుర్ద్ గ్రామంలో ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. సోమవారం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. 15 ఏళ్ల బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లినప్పుడు దుండగులు ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులు పవన్, నరేందర్, దాల్షర్గా గుర్తించారు. ఈ ముగ్గురు రాజానా కుర్ద్ గ్రామానికే చెందిన వారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితులపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.