విద్యాసంస్థలపై పార్టీలకు, సంస్థలకు పెత్తనం తగదు | Rahul Gandhi calls for political consensus to end the paper-leak industry | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థలపై పార్టీలకు, సంస్థలకు పెత్తనం తగదు

Jul 18 2026 4:43 AM | Updated on Jul 18 2026 4:43 AM

Rahul Gandhi calls for political consensus to end the paper-leak industry

పేపర్‌ లీకులకు వ్యవస్థదే బాధ్యత 

దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం అవసరం 

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు 

డెహ్రాడూన్‌: దేశంలోని విద్యాసంస్థలపై ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా సంస్థకు పెత్తనం ఉండరాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. పేపర్‌ లీకేజీ ఘటనలపై రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం డెహ్రాడూన్‌లో ఆయన కాంగ్రెస్‌ చేపట్టిన చాత్రోం కీ గుంజ్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 

విద్యావ్యవస్థలో అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పేపర్‌ లీకేజీలకు కారణమని, వీటి కారణంగా ఇప్పటి వరకు కనీసం 7.5 కోట్ల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్‌ సెంటర్లు, పరీక్ష కేంద్రాలు, పేపర్‌ రూపకల్పన చేసేవారు, ట్రాన్స్‌లేటర్లు, రవాణాదారులు, విక్రేతలు ఇంకా, ఎన్‌టీఏ, అన్నిటికంటే పైన విద్యాశాఖ మంత్రి సహా మొత్తం వ్యవస్థ అంతా ఈ అక్రమాలకు కారణమయ్యారని ఆరోపించారు. వీరిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ‘మన విద్యాసంస్థలు స్వతంత్రంగా ఉండాలి.

 ఏ ఒక్క రాజకీయ పార్టీ, లేదా సంస్థ మన విద్యాసంస్థలపై పెత్తనం చేయరాదు. ఎన్‌టీఏ చీఫ్, వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లుగా ఏదో ఒక సంస్థతో సంబంధాలున్న వారిని నియమించరాదు’అని పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీ ఘటనలను అంతం చేయాలంటే రాజకీయ ఏకాభిప్రాయం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని రాహుల్‌ పేర్కొన్నారు. 

లాభాపేక్ష మాత్రమే కలిగి ఉండే ప్రైవేట్‌ సంస్థలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించరాదని తెలిపారు. పరీక్షల నిర్వహణ ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. పేపర్‌ లీకేజీ ఘటనలు బయటకు వచ్చిన వెంటనే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అదే సమయంలో, బాధితులైన విద్యార్థులకు పరిహారం చెల్లించడం, రక్షణ కల్పించడం, వెంటనే మళ్లీ పరీక్ష నిర్వహించడం వంటి తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement