భర్తల ఉద్యోగాలను ఊడగొడుతున్నారు..! | Wives Practice Of Complaining To Husbands Employers Over Matrimonial Disputes | Sakshi
Sakshi News home page

భర్తల ఉద్యోగాలను ఊడగొడుతున్నారు..!

Jul 18 2026 4:54 AM | Updated on Jul 18 2026 4:54 AM

Wives Practice Of Complaining To Husbands Employers Over Matrimonial Disputes

 
యాజమాన్యాలకు భార్యలు ఫిర్యాదు చేయడం ఆందోళనకరం 

ఉద్యోగం పోతే భరణం ఎలా అడుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్న 

మధ్యవర్తిత్వ కేంద్రానికి కేసు బదిలీ

సాక్షి, న్యూఢిల్లీ: వైవాహిక వివాదాల నేపథ్యంలో భర్తలు పనిచేసే సంస్థల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు భార్యలు నేరుగా ఫిర్యాదు చేసే ధోరణిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసోంలో తన భర్త స్నేహితుడు తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. 

ఘజియాబాద్‌లో తన భర్తపై ఇప్పటికే పలు కేసులు పెట్టి న్యాయపోరాటం చేస్తున్నానని, అందువల్ల ఈ కేసును కూడా అక్కడికే బదిలీ చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. ‘చాలా మంది భార్యలు ఇదే చేస్తున్నారు. భర్తపై యజమానులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. విడాకులు కోరడం వేరు. కానీ, వారి జీవనాధారాన్ని దెబ్బతీయడం వేరు. ఇది మరీ దారుణం‘అని పేర్కొన్నారు. 

పిటిషనర్‌ భర్త ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి. నిబంధనలకు విరుద్ధంగా ఆయన సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడని ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులకు పిటిషనర్‌ (భార్య) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా భర్త సన్నిహితుడైన సహోద్యోగి ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై జస్టిస్‌ నాగరత్న కల్పించుకుని.. ‘మీరు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు కారు. మీరెందుకు ఫిర్యాదు చేశారు? వైవాహిక వివాదాలు ఉన్నంత మాత్రాన యజమానికి ఫిర్యాదు చేయడం భార్యలు చేయగలిగే అత్యంత దారుణమైన పని. ఆ ఫిర్యాదులతో వారు ఉద్యోగాలు కోల్పోతారు. ఆ తర్వాత మీరు ఎంత భరణం కోరగలరు?‘అని ప్రశ్నించారు. 

పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెల్మెట్‌ను భార్య, ఆమె సోదరుడు దొంగిలించారని భర్త మొదట తప్పుడు ఫిర్యాదు చేశాడని కోర్టుకు తెలిపారు. ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికే తాము ఎయిర్‌ఫోర్స్‌ అధికారులకు వినతిపత్రం ఇచ్చామని వివరించారు. పరువు నష్టం దావాను భర్త దాఖలు చేయలేదని, అతని స్నేహితుడు దాఖలు చేశాడని న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఈ కేసును మధ్యవర్తిత్వ కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని, ఆరోపణలను వెనక్కి తీసుకునేలా భార్యకు తగిన సలహా ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాదికి జస్టిస్‌ నాగరత్న సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement