వృద్ధ ఖైదీల ముందస్తు విడుదలకు సమగ్ర విధానం  | Supreme Court orders States to frame policy for early release of elderly | Sakshi
Sakshi News home page

వృద్ధ ఖైదీల ముందస్తు విడుదలకు సమగ్ర విధానం 

Jul 17 2026 6:22 AM | Updated on Jul 17 2026 6:22 AM

Supreme Court orders States to frame policy for early release of elderly

సాక్షి, న్యూఢిల్లీ: దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, వృద్ధాప్యంలో ఉన్న ఖైదీలను ముందుగానే విడుదల చేసేందుకు వీలుగా సమగ్ర విధానాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా ఈ పాలసీని రూపొందించి, నోటిఫై చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. డెబ్భై ఏళ్లు పైబడిన వద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలను ముందుగానే విడుదల చేసేందుకు దేశవ్యాప్త మార్గదర్శకాలు రూపొందించాలంటూ జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.  

అర్హతలు, ప్రక్రియ స్పష్టంగా ఉండాలి...  
విడుదల చేయాల్సిన ఖైదీల అర్హతా ప్రమాణాలు, ముందస్తు విడుదలను పరిశీలించేందుకు అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టంగా నిర్వచించాలని ధర్మాసనం రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయంలో రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థలతో సంప్రదింపులు జరపాలంది. ‘ప్రాణాంతక వ్యాధి అనే పదానికి స్పష్టమైన, ఏకరీతి నిర్వచనాన్ని పొందుపరచాలి. దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, పరిష్కారం కోసం కాలబద్ధమైన, పారదర్శక ప్రక్రియను నిర్దేశించాలి. జాప్యం కారణంగా ఖైదీలు తమ చివరి రోజులను జైలులో గడిపే పరిస్థితిని నివారించాలి. ముందస్తు విడుదలకు సంబంధించిన నిర్ణయాలన్నీ హేతుబద్ధంగా ఉండటంతో పాటు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి’అని పేర్కొంది. 

స్వతంత్ర వైద్య బోర్డుల ఏర్పాటు.. 
ఖైదీల ఆరోగ్య పరిస్థితిని నిష్పాక్షికంగా అంచనా వేసి, ధ్రువీకరించేందుకు డివిజన్, రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర వైద్య బోర్డులను ఏర్పాటు చేయాలి. అలాగే, అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీల పనితీరుతో ఈ విధానాన్ని అనుసంధానించాలి. వయోభారం, ప్రాణాంతక వ్యాధులు, శారీరక వైకల్యంతో బాధపడుతున్న ఖైదీల కేసులను ఈ కమిటీలు క్రమం తప్పకుండా సమీక్షించి.. బెయిల్, పెరోల్‌ లేదా శిక్ష తగ్గింపు వంటి తగిన చట్టపరమైన చర్యలను సిఫార్సు చేయాలి. ఇందుకు సంబంధించి జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ప్రతిపాదించిన విధానాన్ని రాష్ట్రాలు స్వీకరించవచ్చు లేదా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. మానవతా దక్పథంతో విడుదలైన ఖైదీలకు నిరంతర వైద్య సంరక్షణ, సామాజిక మద్దతు అందేలా చూడాలి. కమ్యూనిటీ హెల్త్‌ సరీ్వసులు, సాంఘిక సంక్షేమ శాఖలు, న్యాయ సహాయ సంస్థల మధ్య సమన్వయం ఉండేలా పాలసీలో నిబంధనలు పొందుపరచాలి.

ఈ–ప్రిజన్స్‌ పోర్టల్‌తో అనుసంధానం 
ముందస్తు విడుదల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొత్తాన్ని ఈ–ప్రిజన్స్‌ పోర్టల్‌తో పూర్తిగా అనుసంధానించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దరఖాస్తు సమర్పణ, వైద్య మూల్యాంకనం, జైలు అధికారుల నివేదికలు, వైద్య బోర్డు సిఫార్సులు, రివ్యూ కమిటీల సూచనలు, తుది నిర్ణయం, అందుకు గల కారణాలను ప్రతి దశలోనూ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆటోమేటెడ్‌ అలర్ట్స్‌ ద్వారా సకాలంలో ప్రక్రియ పూర్తయ్యేలా, పారదర్శకత ఉండేలా ఈ పోర్టల్‌ ఉపయోగపడాలని కోర్టు అభిప్రాయపడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement