సాక్షి, న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ.. సీబీఐ చేసిన బెయిల్ రద్దు అభ్యర్థనను తిరస్కరించింది.
దాణా కుంభకోణంలోని డియోఘర్ ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు 2021లో బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాలూ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం.ఎం. సుంద్రేష్, జస్టిస్ పీబీ వరాలే ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశం
అయితే లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురి శిక్షపై దాఖలైన అప్పీల్ పిటిషన్లు జార్ఖండ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ అప్పీల్ విచారణను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా.. అంటే ఆరు నెలల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.
దాణా కుంభకోణం కేసులో శిక్ష
1990లలో బిహార్‌లో జరిగిన దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పశువుల దాణా పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా నిధులు విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌పై పలు అభియోగాలు నమోదయ్యాయి. డియోఘర్ ట్రెజరీ కేసులో 2018లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా తేల్చి శిక్ష విధించింది. అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించగా.. 2021లో బెయిల్ లభించింది.
బెయిల్ కొనసాగింపు.. అప్పీల్‌పై ఉత్కంఠ
తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ.. అసలు శిక్షపై ఉన్న అప్పీల్ విచారణ మాత్రం కీలకంగా మారింది. ఆరు నెలల్లో హైకోర్టు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.


