వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు
రోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలి
అవసరమైతే చికిత్స అందించాలి
కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు
నిరసన వ్యక్తీకరణ ప్రతి పౌరుడి హక్కు
ప్రాణ రక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతని ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది.
వాంగ్‌చుక్‌కు ప్రతిరోజూ వైద్యపరీక్షలు చేయాలని, అవసరమైన చికిత్సను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాల హైకోర్టు ధర్మాసనం సూచనలుచేసింది. వాంగ్‌చుక్‌కు తక్షణ వైద్య సహాయం అందించాలని కోరుతూ న్యాయవాది రాకేష్ సైనీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ పౌరుని ప్రాణ రక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత’అని కోర్టు వ్యాఖ్యానించిది.
బలవంతంగా ఆస్పత్రికి తరలించాలి
వాంగ్‌చుక్‌ను తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని, ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే ద్రవ ఆహారం, విటమిన్లు, ఖనిజ లవణాలు బలవంతంగా అందించేలా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టును పిటిషనర్ రాకేష్ కోరారు. వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయన ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల బృందం వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్స అందిస్తాం’అని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం’అని «న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
సంక్లిష్టంగా మారుతున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: గత నెల 28వ తేదీనుంచి ఎలాంటి ఆహారం తీసుకోని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి ఇకపై మరింత విషమంగా మారే ప్రమాదముందని వైద్యులు తేలి్చచెప్పారు. దాదాపు 20 రోజులుగా ఆహారం తీసుకోని కారణంగా ఆయన అంతర్గత అవయవాలు దు్రష్పభావాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్ సతీశ్ లాంబా గురువారం విడుదలచేసిన ఒక హెల్త్ బులెటెన్‌లో అభిప్రాయపడ్డారు.
తాజా బులెటెన్ ప్రకారం నిరాహార దీక్ష కారణంగా వాంగ్‌చుక్ 9 కేజీలకుపైగా బరువు కోల్పోయి ప్రస్తుతం 56.9 కేజీలకు తగ్గారు. ‘‘ఆయనలో గ్లూకోజ్ నిల్వలు అయిపోయాక శరీరం కొవ్వును కరిగిస్తోంది. కొవ్వూ కరిగాక ఇప్పుడు కండరాలను కరిగించడం ఆరంభించింది. దీంతో కీటోన్ స్థాయిలు 3ప్లస్‌కు పడిపోయాయి. నీరు తాగడంతో కాస్తంత మెరుగుపడి 2ప్లస్‌కు వచ్చింది. ఇప్పటికీ యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే అంతర్గత అవయావాలు దెబ్బతినడం మొదలవుతుంది’అని డాక్టర్ సతీశ్ లాంబా వివరించారు.
దీక్ష విరమించబోను: వాంగ్‌చుక్
ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నాపత్రల లీకేజీ ఉదంతంలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా డిమాండ్‌పై మోదీ సర్కార్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకుండా నిరాహార దీక్షను విరమిస్తే ఈ నిరసకు అర్థంలేకుండా పోతుందని బుధవారం అర్ధరాత్రి విడుదలచేసిన ఒక వీడియో సందేశంలో వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ‘‘రాజకీయనేతలు, మద్దతుదారులు ఎంత చెప్పినా నేను నిరాహారదీక్ష విరమించబోను. నేనేం నాలుగురోజులకే చనిపోను. నీరసం, కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతున్నా హృదయంలోని ఉక్కు సంకల్పంతో ఇంకొన్నాళ్లు దీక్ష కొనసాగించగలను. నన్ను ప్రశ్నించేబదులు ఇంకా ఎందుకు దిగిరావట్లేదో ప్రభుత్వాన్ని నిలదీయండి’’అని వాంగ్‌చుక్ అన్నారు.


