ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి సవరణలు
ఆదాయ పన్ను (సవరణ)బిల్లు
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ఈ నెల 20వ తేదీ నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. జాతీయ గీతం వందేమాతరంతో సమానమైన చట్టబద్ధమైన రక్షణలు కల్పించే బిల్లుతోపాటు, ప్రభుత్వేతర సంస్థల(ఎన్జీవో)లు అందుకునే విదేశీ విరాళాలను దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ(ఎఫ్‌సీఆర్‌ఏ) బిల్లు–2026 ఇందులో ప్రముఖంగా ఉన్నాయి.
జనన, మరణాల ఆలస్య నమోదు విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు, అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ)లను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే రకమైన ఏకీకృత నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లును కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గురువారం లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బులెటిన్ విడుదల చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు లభించే వడ్డీ ఆదాయం, మూలధన లాభాలపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు గతంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఆదాయ పన్ను (సవరణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.


