మొబైల్స్, సెమీకండక్టర్ల రంగానికి కేంద్ర కేబినెట్ భారీ నజరానా
ఐదేళ్లలో రూ. 39 లక్షల కోట్ల మొబైల్స్ ఉత్పత్తి.. 60 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
2028 నాటికి దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని గ్లోబల్ ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్(ఎంపీఎంఎస్), సెమికాన్ 2.0 పేరిట మొత్తం రూ.1,90,000 కోట్ల బడ్జెట్‌తో నూతన విధానాలకు పచ్చజెండా ఊపింది.
వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ తర్వాత మీడియాకు తెలిపారు. ఎంపీఎంఎస్ కింద దేశీయ విడిభాగాల కొనుగోలు, స్థానిక బ్రాండ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దేశంలో తయారైన మొబైల్ ఫోన్ల విక్రయాలపై 2.25 శాతం నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకం ఇస్తారు. కీలకమైన విడిభాగాలు, సబ్–అసెంబ్లీలను స్థానికంగానే కొనుగోలు చేస్తే అదనంగా 1.5 శాతం ఇన్సెంటివ్ లభిస్తుంది. ప్రొడక్ట్ డిజైన్, పరిశోధన–అభివృద్ధి రంగాల్లో పేటెంట్లను సృష్టించే బ్రాండ్లకు మరో 3 శాతం ప్రోత్సాహకం అందజేస్తారు.
రూ. 1,27,500 కోట్లతో ‘సెమికాన్ 2.0’
భారత్‌ను అంతర్జాతీయ సెమీకండక్టర్ పటంలో నిలబెట్టడానికి రూ.1,27,500 కోట్ల బడ్జెట్‌తో ‘సెమికాన్ 2.0’ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సెమీకండక్టర్ల డిజైన్, తయారీ కోసం సమగ్రమైన ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఆరు కీలక అంశాలతో ఈ విధానాన్ని రూపొందించారు. చిప్ డిజైన్, యంత్రాలు–ముడిసరుకు, ఫ్యాబ్‌ల ఏర్పాటు, ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్) విభాగాలను ఇందులో చేర్చారు.
2028 కల్లా తొలి ఫ్యాబ్
దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్ 2028 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభం కానుంది. సిలికాన్ ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటుకు అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించేలా వ్యూహరచన చేశారు. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈల నుంచి వచి్చన 24 సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. చిప్‌ల అభివృద్ధిలో నిమగ్నమైన 105 స్టార్టప్‌లకు ఎల్రక్టానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ వినియోగించుకునే అవకాశం కల్పించారు.
వారణాసికి రూ.25 వేల కోట్లతో రహదారులు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోసం దాదాపు రూ.25,500 కోట్ల వ్యయంతో రెండు రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసిలో వాహనాల రద్దీని తగ్గించడానికి వరుణా నది వెంబడి ఎన్‌హెచ్–31తోపాటు నగరంలో రింగ్ రోడ్‌ను కలిపే 43.21 కిలోమీటర్ల అనుసంధాన మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్లు, లూప్స్, ర్యాంప్‌లు, సర్వీసు రోడ్లు ఉంటాయి. ఎన్‌హెచ్–31, కాశీ రైల్వే స్టేషన్ మధ్య, వారణాసి రింగ్ రోడ్, వారణాసి విమానాశ్రయం, కాశీ రైల్వే స్టేషన్, వారణాసి సిటీ రైల్వే స్టేషన్, వారణాసి జంక్షన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, రామ్‌నగర్ పోర్ట్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి ఘాట్‌లు, చందౌలి తదితర ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత సులభతరం కానుంది.
ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: మోదీ
సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, ఆవిష్కరణలకు భారత్‌ను గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దాల ని ప్రభుత్వం సంకల్పించినట్లు ప్రధాని మోదీ బుధవారం పేర్కొన్నారు. రూ.1,90,000 కోట్లతో మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్, సెమికాన్ 2.0 ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించారు.
మొబైల్స్ తయారీకి రూ.62,500 కోట్లు
దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ఉద్దేశించిన ‘ఎంపీఎంఎస్’పథకానికి కేంద్రం రూ.62,500 కోట్లు కేటాయించింది. గతంలో అమలైన పీఎల్‌ఐ–ఎల్‌ఎస్‌ఈఎం పథకం గడువు 2026 మార్చి 31తో ముగియడంతో దాని స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇది 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ ఐదేళ్లలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరగడమే కాకుండా ఎల్రక్టానిక్స్ రంగంలో 60 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
యూరియా రంగంలో కొత్త విధానం ‘నిపు–2026’
దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన ‘జాతీయ యూరియా పెట్టుబడుల విధానం(నిపు)–2026’కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నూతనంగా గ్యాస్ ఆధారిత యూరియా తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇటీవల ఎరువుల శాఖకు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నూతన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానం అవసరమని గుర్తించిన ప్రభుత్వం నిపు–2026ను అమల్లోకి తెచి్చంది. పాత విధానంతో పోలిస్తే ఈ కొత్త విధానం కింద ఏర్పాటయ్యే ప్రతి ప్లాంట్‌కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇకపై ఏర్పాటు చేయబోయే కొత్త యూరియా తయారీ యూనిట్లన్నీ ఈ విధానం పరిధిలోకే వస్తాయి. దేశంలో 26.94 మిలియన్ టన్నుల స్థాపిత సామర్థ్యంతో 33 యూరియా తయారీ యూనిట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కోటి∙టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 9 కొత్త గ్యాస్ ఆధారిత ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


