ఎఫ్‌సీఐ గోదాముల్లో దాదాపు 604 లక్షల టన్నుల ధాన్యం పేరుకుపోయి ఉన్న సమయంలో అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకు కిలోల పరిమితి విధించ డమంటే వారి ఆహార హక్కును లాగేయడమే!
సందర్భం
ఆహార భద్రతా చట్టానికి సవరణలు చేయటానికి కేంద్రప్రభుత్వం పూనుకుంది. ఏదైనా ఆహార భద్రతా చట్టంలో మార్పును పరీక్షించడానికి ఒక సులభమైన కొలమానం ఉంది. ఆ పథకం ఎవరి కోసం రూపొందిందో ఆ వ్యక్తిని – అంటే గాంధీజీ చెప్పిన ‘అంత్యోదయ’, వరుసలో చిట్టచివరి మనిషిని – తీసుకోవడం; ఈ సవరణ తర్వాత అతడికి ఎక్కువ ఆహారం అందుతుందా, తక్కువా అని అడగడం. జాతీయ ఆహార భద్రతా (సవరణ) బిల్లు, 2026కు ఈ పరీక్ష పెడితే వచ్చే జవాబు స్పష్టం: ప్రతి కుటుంబానికీ తక్కువే. ఒంటరిగా ఉండే వితంతువుకు మరీ తక్కువ. ఈ చట్టం ఆమెనూ, ఆమెలాంటి వాళ్లనూ రక్షించడానికి రూపొందినది కావడమే ఇక్కడ గమనార్హం.
పెద్ద కుటుంబాల మాటేమిటి?
‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) కింద కుటుంబానికి నెలకు 35 కిలోల ధాన్యం ఇచ్చే హక్కును ఈ బిల్లు తీసేసి, ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కుటుంబానికి గరిష్ఠంగా 35 కిలోల పరిమితిని విధిస్తోంది. దీన్ని ‘అసమానతలను తొలగించడం’గా ప్రభుత్వం చెబుతోంది. కానీ లెక్క చూస్తే నిజం బయటపడుతుంది: ఒంటరి వ్యక్తికి 35 నుంచి 7 కిలోలకు (80% కోత) తగ్గుతుంది. ఇద్దరికి 14 కిలోలకు, ముగ్గురికి 21కి, నలుగురికి 28కి పడిపోతుంది. ఐదుగురి కుటుంబం మాత్రమే సరిగ్గా 35 కిలోలు తీసుకుంటుంది. ఆరు, ఏడు, ఎనిమిది మంది ఉన్న కుటుంబాలు 35 కిలోల పరిమితి వల్ల ఉన్న చోటే ఉండిపోతాయి. ఏ ఒక్క ‘ఏఏవై’ కుటుంబానికీ ఒక్క కిలో అదనంగా రాదు. ‘లాభం’ అనే గడి పూర్తిగా ఖాళీ. 7 కిలోలు పోషకాహార ప్రమాణమే అయితే, ఎనిమిది మంది కుటుంబానికి 56 కిలోలు కావాలి. కానీ పరిమితి వాళ్లకు 35 మాత్రమే ఇస్తుంది. అంటే తలసరి 4.4 కిలోలు. సాధారణ ప్రాధాన్య కుటుంబం కంటే కూడా తక్కువ. ఈ పోషకాహార సూత్రం కోత పెట్టే చోట పని చేస్తుంది, హక్కు పెంచాల్సిన చోట మాత్రం మౌనంగా ఉంటుంది. ఒకే వైపు పనిచేసే సూత్రం కాదు – అది సమానత్వం ముసుగులో ఒక పొదుపు లక్ష్యం మాత్రమే.
ఒంటరివాళ్లు ఏం కావాలి?
చిన్న కుటుంబాలపైనే ఈ పథకాన్ని కేంద్రీ కరించారు. ఏఏవైలో చిన్న కుటుంబం అనేది యాదృచ్ఛికం కాదు, అదే దాని రూపకల్పన. 2000 సంవత్సరం నుంచి ఏఏవై రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది: ఆసరా లేని వితంతువులు, ఒంటరి మహిళలు, మంచానపడ్డ రోగులు, వికలాంగులు, ఆధారం లేని వృద్ధులు, ఆదిమ తెగలు,ఒంటరిగా బతికే నిరుపేదలను గుర్తించండి అని! దారిద్య్రం మన దేశంలో ఒకరిద్దరుగానే ఉంటుంది. అందుకే 35 కిలోల ఫ్లాట్ హక్కు పొరపాటు కాదు, అది తలసరి లెక్కకు కుదించ లేని ఒక గుర్తింపు. ఒంటరి నిరుపేదకు ఆ రేషన్ కేవలం ఆహారం కాదు; పింఛను అందని నెలకు అది ఆసరా, ఇంట్లో ఏ ఆపదనైనా తట్టుకోగల ఏకైక ఆస్తి. రేషన్ దుకాణంలో ఒంటరి కార్డుపై వేలి ముద్ర ఎవరిదో చూసిన వారికి తెలుసు. అది చాలావరకు ఏ దిక్కూ లేని ఒక ముసలి స్త్రీది. ఆమె 35 కిలోలు ఇప్పుడు 7 కిలోలు అవుతాయి. చట్టం చరిత్రలోనే విధించిన అతిపెద్ద కోత ఇది.
పైగా ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? ఎఫ్‌సీఐ గోదాముల్లో దాదాపు 604 లక్షల టన్నుల ధాన్యం– బఫర్ ప్రమాణానికి దాదాపు మూడు రెట్లు– పేరుకుపోయి ఉన్నప్పుడు. అదే సమయంలో రైతులు వరి, గోధుమ, కంది, పెసర కనీస మద్దతు ధర కంటే తక్కు వకే అమ్ముకుంటున్నారు. మిగులుపై కూర్చొని, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అత్యంత పేద కుటుంబాల రేషన్ నుంచి ఏటా 22–25 లక్షల టన్నులు తీసేయడం – ఇది కొరత వల్ల కాదు, పొదుపు పేరుతో జరుగుతున్న మార్పు. సేకరణ దగ్గర రైతును,పంపిణీ దగ్గర పేదను నొక్కి, మధ్యలో మిగిలిన దాన్ని ‘పొదుపు’ అని పిలవడం– ఇది మనం మళ్లీ మళ్లీ చూస్తున్న నమూనా. ఇది చట్టం చరిత్రలో మొదటిసారిగా ఒక హక్కును తగ్గించే సవరణ. ఆర్టికల్ 21 కింద ఆహార హక్కును ఒకసారి కల్పించాక దాన్ని వెనక్కి తీసుకోవడం రాజ్యాంగపరంగా ప్రశ్నార్థకం. పైగా ఇంత కీలకమైన మార్పును – ఈమెయిల్ ద్వారా, ఇంగ్లిష్‌లో మాత్రమే, కొద్ది రోజుల గడువుతో సంప్రదింపులకు పెట్టడం ప్రభుత్వం తన శాసన సంప్ర దింపుల విధానాన్నే ఉల్లంఘించడం!
అసలు పరిష్కారం
ప్రభుత్వం చెప్పే సమస్య నిజమైనదే అయితే, పరిష్కారం చాలా సులభం. ఒక అంత్యోదయ అన్న యోజన కుటుంబానికి హక్కు ఒక్కొక్కరికి 7 కిలోలు, లేదా కుటుంబానికి 35 కిలోలు– వీటిలో ఏది ఎక్కువ అయితే అది నిర్ణయించవచ్చు. చిన్న కుటుంబాలు తమ రక్షణను నిలబెట్టుకుంటాయి; పెద్ద కుటుంబాలకు– ఆరుగురికి 42 కిలోలు, ఎనిమిది మందికి 56 కిలోలు వస్తాయి. బిల్లు ఉదహరించే ఐసీఎంఆర్ పోషణ ప్రమాణానికి తగిన వాటా దొరుకుతుంది. దీనికి కావాల్సిన అదనపు ధాన్యం నేటి మిగులు ముందు నామమాత్రమే. పైగా అది గోదాముల ఒత్తిడిని తగ్గించి, కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయిన మార్కెట్‌లో సేక రణకు ఊతమిస్తుంది. ఎవరూ నష్టపోరు, అందరూ లాభపడతారు. కానీ ప్రభుత్వం మాత్రం పేదలే ఎక్కువ నష్టపోయే సూత్రాన్ని ఎంచుకుంది. మిగిలిన ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు సబ్సిడీతో అందించే బదులు ఆకలితో ఉన్నవాళ్లకి అందిస్తే మంచిది కదా!
అలా అని ఇప్పుడు ఉన్న చట్టంలో సమస్యలు లేవని కాదు. నిజానికి చట్టానికి సంస్కరణలు అవసరమే– కానీ ఈ దిశలో కాదు. అసలైన సవరణ ఐదు ప్రశ్నలను ఎదుర్కోవాలి. మొదటిది, జనాభాలో ఒక శాతం ప్రకారం కాక నిజంగా అవసరమున్నవారిని క్షేత్రస్థాయిలో గుర్తించి చేర్చడం. రెండోది, బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా పప్పులు, చిరుధాన్యాలు, నూనెను రేషన్ బుట్టలో చేర్చడం. మూడోది, ప్రజాపంపీణీ వ్యవస్థ ఆహారం తినడానికి సురక్షితంగా ఉండేలా ప్రమాణాలు, పరీక్షలు, తిరస్కరించే హక్కు కల్పించడం. నాలుగోది, రైతును తక్కువ ధరతో ముంచి చౌక ఆహారానికి రాయితీ ఇవ్వడం ఆపి, గిట్టుబాటు ధర (సీ2+50%)ను ఆహార భద్రత నిజ ఖర్చుగా గుర్తించడం. ఐదోది, మిగతా నాలుగింటినీ సాధ్యం చేసేది– వ్యవస్థను వికేంద్రీకరించి, జిల్లాను ప్రాతిపదికగా చేసి, స్థానిక ఎఫ్‌పీఓలకు సేకరణ, నిల్వ,పంపిణీ బాధ్యతలను అప్పగించడం. ఈ బిల్లును ఇప్పటికీ వెనక్కి తీసుకోవచ్చు. దాని వెనుక ఉన్న శక్తిని, చట్టం దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిజమైన సంస్కరణ వైపు మళ్లించడమే మెరుగైన మార్గం. అలా కాక, సమానత్వం ముసు గులో చేసేది కేవలం కోత మాత్రమే!
డా‘‘ జి.వి.రామాంజనేయులు
వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,
‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్


