breaking news
Antyodaya Anna Yojana
-
వ్యక్తికి 7 కిలోలే.. గరిష్ఠంగా 35 కేజీలు
దేశంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) పథకంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ), 2013కు సవరణలు చేస్తూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్మెంట్) బిల్లు, 2026’ ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఇప్పటివరకు ప్రతి అంత్యోదయ కుటుంబానికి లభిస్తున్న స్థిర కోటా (35 కిలోల ఆహారధాన్యాలు) విధానంలో మార్పులు రానున్నాయి.కొత్త రూల్ ఏమిటి?ప్రస్తుతం అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ఆహారధాన్యాలను (ఉచితంగా) అందిస్తున్నారు. అయితే, కొత్త ముసాయిదా చట్టం ప్రకారం.. ఇకపై కుటుంబ ప్రాతిపదికన కాకుండా, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున రేషన్ కేటాయించనున్నారు. అదే సమయంలో ఒక ఫ్యామిలీకి ఇచ్చే గరిష్ఠ పరిమితిని 35 కిలోలుగానే ఉంచనున్నారు.చిన్న కుటుంబాలకు కోత.. పెద్ద కుటుంబాలకు ఎలా?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త వ్యక్తిగత పరిమితి విధానం వల్ల ఒకటి నుంచి నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు రేషన్ కోటా భారీగా తగ్గనుంది. ఒక్కరు ఉండే కుటుంబానికి 35 కిలోల స్థానంలో కేవలం 7 కిలోలు మాత్రమే అందుతాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే గరిష్ఠ పరిమితి 35 కిలోలు మాత్రమే అందుతుంది. అంటే ఐదుగురు కంటే ఎక్కువ (ఉదాహరణకు ఆరుగురు) ఉన్న కుటుంబంలో తలసరి కోటా 7 కిలోల కంటే తక్కువకు పడిపోతుంది.ప్రభుత్వ వాదన ఏమిటి?తక్కువ మంది ఉన్న కుటుంబాలకు ఎక్కువ రేషన్, ఎక్కువ మంది ఉన్న పేద కుటుంబాలకు తలసరిగా తక్కువ రేషన్ అందుతోందని ఈ వ్యత్యాసాన్ని తొలగించి పంపిణీని మరింత హేతుబద్ధం చేయడానికే ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు కేంద్ర ఆహార శాఖ పేర్కొంది. సాధారణ ప్రాధాన్యత గల కుటుంబాలకు ఇచ్చే తలసరి 5 కిలోల కంటే ఇది ఎక్కువగా (7 కిలోలు) ఉంటుందని స్పష్టం చేసింది.రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..ఈ ముసాయిదా చట్టంపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలు కావడం వల్ల చిన్న కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీస్) ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టం వల్ల వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్న అంత్యోదయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వ్యక్తగత ప్రాతిపదికన రేషన్ ఇవ్వాలనుకుంటే కుటుంబానికి విధించిన 35 కిలోల గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) ఎత్తివేయాలని, లేదంటే పెద్ద కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుందని ఆహార భద్రతా హక్కుల కార్యకర్తలు సూచిస్తున్నారు. ఈ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
సమానత్వం పేరిట ఆహారంలో కోత
ఆహార భద్రతా చట్టానికి సవరణలు చేయటానికి కేంద్రప్రభుత్వం పూనుకుంది. ఏదైనా ఆహార భద్రతా చట్టంలో మార్పును పరీక్షించడానికి ఒక సులభమైన కొలమానం ఉంది. ఆ పథకం ఎవరి కోసం రూపొందిందో ఆ వ్యక్తిని – అంటే గాంధీజీ చెప్పిన ‘అంత్యోదయ’, వరుసలో చిట్టచివరి మనిషిని – తీసుకోవడం; ఈ సవరణ తర్వాత అతడికి ఎక్కువ ఆహారం అందుతుందా, తక్కువా అని అడగడం. జాతీయ ఆహార భద్రతా (సవరణ) బిల్లు, 2026కు ఈ పరీక్ష పెడితే వచ్చే జవాబు స్పష్టం: ప్రతి కుటుంబానికీ తక్కువే. ఒంటరిగా ఉండే వితంతువుకు మరీ తక్కువ. ఈ చట్టం ఆమెనూ, ఆమెలాంటి వాళ్లనూ రక్షించడానికి రూపొందినది కావడమే ఇక్కడ గమనార్హం.పెద్ద కుటుంబాల మాటేమిటి?‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) కింద కుటుంబానికి నెలకు 35 కిలోల ధాన్యం ఇచ్చే హక్కును ఈ బిల్లు తీసేసి, ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కుటుంబానికి గరిష్ఠంగా 35 కిలోల పరిమితిని విధిస్తోంది. దీన్ని ‘అసమానతలను తొలగించడం’గా ప్రభుత్వం చెబుతోంది. కానీ లెక్క చూస్తే నిజం బయటపడుతుంది: ఒంటరి వ్యక్తికి 35 నుంచి 7 కిలోలకు (80% కోత) తగ్గుతుంది. ఇద్దరికి 14 కిలోలకు, ముగ్గురికి 21కి, నలుగురికి 28కి పడిపోతుంది. ఐదుగురి కుటుంబం మాత్రమే సరిగ్గా 35 కిలోలు తీసుకుంటుంది. ఆరు, ఏడు, ఎనిమిది మంది ఉన్న కుటుంబాలు 35 కిలోల పరిమితి వల్ల ఉన్న చోటే ఉండిపోతాయి. ఏ ఒక్క ‘ఏఏవై’ కుటుంబానికీ ఒక్క కిలో అదనంగా రాదు. ‘లాభం’ అనే గడి పూర్తిగా ఖాళీ. 7 కిలోలు పోషకాహార ప్రమాణమే అయితే, ఎనిమిది మంది కుటుంబానికి 56 కిలోలు కావాలి. కానీ పరిమితి వాళ్లకు 35 మాత్రమే ఇస్తుంది. అంటే తలసరి 4.4 కిలోలు. సాధారణ ప్రాధాన్య కుటుంబం కంటే కూడా తక్కువ. ఈ పోషకాహార సూత్రం కోత పెట్టే చోట పని చేస్తుంది, హక్కు పెంచాల్సిన చోట మాత్రం మౌనంగా ఉంటుంది. ఒకే వైపు పనిచేసే సూత్రం కాదు – అది సమానత్వం ముసుగులో ఒక పొదుపు లక్ష్యం మాత్రమే.ఒంటరివాళ్లు ఏం కావాలి?చిన్న కుటుంబాలపైనే ఈ పథకాన్ని కేంద్రీ కరించారు. ఏఏవైలో చిన్న కుటుంబం అనేది యాదృచ్ఛికం కాదు, అదే దాని రూపకల్పన. 2000 సంవత్సరం నుంచి ఏఏవై రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది: ఆసరా లేని వితంతువులు, ఒంటరి మహిళలు, మంచానపడ్డ రోగులు, వికలాంగులు, ఆధారం లేని వృద్ధులు, ఆదిమ తెగలు,ఒంటరిగా బతికే నిరుపేదలను గుర్తించండి అని! దారిద్య్రం మన దేశంలో ఒకరిద్దరుగానే ఉంటుంది. అందుకే 35 కిలోల ఫ్లాట్ హక్కు పొరపాటు కాదు, అది తలసరి లెక్కకు కుదించ లేని ఒక గుర్తింపు. ఒంటరి నిరుపేదకు ఆ రేషన్ కేవలం ఆహారం కాదు; పింఛను అందని నెలకు అది ఆసరా, ఇంట్లో ఏ ఆపదనైనా తట్టుకోగల ఏకైక ఆస్తి. రేషన్ దుకాణంలో ఒంటరి కార్డుపై వేలి ముద్ర ఎవరిదో చూసిన వారికి తెలుసు. అది చాలావరకు ఏ దిక్కూ లేని ఒక ముసలి స్త్రీది. ఆమె 35 కిలోలు ఇప్పుడు 7 కిలోలు అవుతాయి. చట్టం చరిత్రలోనే విధించిన అతిపెద్ద కోత ఇది.పైగా ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? ఎఫ్‌సీఐ గోదాముల్లో దాదాపు 604 లక్షల టన్నుల ధాన్యం– బఫర్ ప్రమాణానికి దాదాపు మూడు రెట్లు– పేరుకుపోయి ఉన్నప్పుడు. అదే సమయంలో రైతులు వరి, గోధుమ, కంది, పెసర కనీస మద్దతు ధర కంటే తక్కు వకే అమ్ముకుంటున్నారు. మిగులుపై కూర్చొని, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అత్యంత పేద కుటుంబాల రేషన్ నుంచి ఏటా 22–25 లక్షల టన్నులు తీసేయడం – ఇది కొరత వల్ల కాదు, పొదుపు పేరుతో జరుగుతున్న మార్పు. సేకరణ దగ్గర రైతును,పంపిణీ దగ్గర పేదను నొక్కి, మధ్యలో మిగిలిన దాన్ని ‘పొదుపు’ అని పిలవడం– ఇది మనం మళ్లీ మళ్లీ చూస్తున్న నమూనా. ఇది చట్టం చరిత్రలో మొదటిసారిగా ఒక హక్కును తగ్గించే సవరణ. ఆర్టికల్ 21 కింద ఆహార హక్కును ఒకసారి కల్పించాక దాన్ని వెనక్కి తీసుకోవడం రాజ్యాంగపరంగా ప్రశ్నార్థకం. పైగా ఇంత కీలకమైన మార్పును – ఈమెయిల్ ద్వారా, ఇంగ్లిష్‌లో మాత్రమే, కొద్ది రోజుల గడువుతో సంప్రదింపులకు పెట్టడం ప్రభుత్వం తన శాసన సంప్ర దింపుల విధానాన్నే ఉల్లంఘించడం! అసలు పరిష్కారంప్రభుత్వం చెప్పే సమస్య నిజమైనదే అయితే, పరిష్కారం చాలా సులభం. ఒక అంత్యోదయ అన్న యోజన కుటుంబానికి హక్కు ఒక్కొక్కరికి 7 కిలోలు, లేదా కుటుంబానికి 35 కిలోలు– వీటిలో ఏది ఎక్కువ అయితే అది నిర్ణయించవచ్చు. చిన్న కుటుంబాలు తమ రక్షణను నిలబెట్టుకుంటాయి; పెద్ద కుటుంబాలకు– ఆరుగురికి 42 కిలోలు, ఎనిమిది మందికి 56 కిలోలు వస్తాయి. బిల్లు ఉదహరించే ఐసీఎంఆర్ పోషణ ప్రమాణానికి తగిన వాటా దొరుకుతుంది. దీనికి కావాల్సిన అదనపు ధాన్యం నేటి మిగులు ముందు నామమాత్రమే. పైగా అది గోదాముల ఒత్తిడిని తగ్గించి, కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయిన మార్కెట్లో సేక రణకు ఊతమిస్తుంది. ఎవరూ నష్టపోరు, అందరూ లాభపడతారు. కానీ ప్రభుత్వం మాత్రం పేదలే ఎక్కువ నష్టపోయే సూత్రాన్ని ఎంచుకుంది. మిగిలిన ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు సబ్సిడీతో అందించే బదులు ఆకలితో ఉన్నవాళ్లకి అందిస్తే మంచిది కదా!అలా అని ఇప్పుడు ఉన్న చట్టంలో సమస్యలు లేవని కాదు. నిజానికి చట్టానికి సంస్కరణలు అవసరమే– కానీ ఈ దిశలో కాదు. అసలైన సవరణ ఐదు ప్రశ్నలను ఎదుర్కోవాలి. మొదటిది, జనాభాలో ఒక శాతం ప్రకారం కాక నిజంగా అవసరమున్నవారిని క్షేత్రస్థాయిలో గుర్తించి చేర్చడం. రెండోది, బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా పప్పులు, చిరుధాన్యాలు, నూనెను రేషన్ బుట్టలో చేర్చడం. మూడోది, ప్రజాపంపీణీ వ్యవస్థ ఆహారం తినడానికి సురక్షితంగా ఉండేలా ప్రమాణాలు, పరీక్షలు, తిరస్కరించే హక్కు కల్పించడం. నాలుగోది, రైతును తక్కువ ధరతో ముంచి చౌక ఆహారానికి రాయితీ ఇవ్వడం ఆపి, గిట్టుబాటు ధర (సీ2+50%)ను ఆహార భద్రత నిజ ఖర్చుగా గుర్తించడం. ఐదోది, మిగతా నాలుగింటినీ సాధ్యం చేసేది– వ్యవస్థను వికేంద్రీకరించి, జిల్లాను ప్రాతిపదికగా చేసి, స్థానిక ఎఫ్పీఓలకు సేకరణ, నిల్వ,పంపిణీ బాధ్యతలను అప్పగించడం. ఈ బిల్లును ఇప్పటికీ వెనక్కి తీసుకోవచ్చు. దాని వెనుక ఉన్న శక్తిని, చట్టం దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిజమైన సంస్కరణ వైపు మళ్లించడమే మెరుగైన మార్గం. అలా కాక, సమానత్వం ముసు గులో చేసేది కేవలం కోత మాత్రమే!డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
మరో 1.58 కోట్ల మందికి ఆహార భద్రత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గ్రామీణ, పట్టణ పేదల కడుపు నింపుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి మరికొంత మందిని చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు కోటిన్నర మందిని కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు ఆఖరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని ఆహార శాఖ వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల్లో కొత్త ఆశలు ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్న యోజన కింద 10 కోట్ల మందికి ప్రతినెలా 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. మరో 71 కోట్ల మందికి రేషన్ కార్డుపై కిలో రూ.3 చొప్పున 5 కిలోల బియ్యం, రూ.2కి గోధుమలు వంటి నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఆహార పంపిణీ కోసం రాయితీ రూపంలో కేంద్రం రూ.4.22 లక్షల కోట్ల ఆర్థిక భారం మోస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాను చేర్చారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టలేదు. పైగా 2013 నుంచి 2021 వరకూ ఆధార్ సంఖ్యలతో రేషన్ కార్డులను సీడింగ్ చేయడం ద్వారా అనర్హులను తొలగించారు. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులున్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా 4.70 కోట్ల కార్డులను ఏరివేశారు. వారి స్థానంలో ప్రస్తుతం అర్హులైన 1.58 కోట్ల మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలపైనే ఎంపిక బాధ్యత కొత్త లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని, ఇందులో తమ పాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉమ్మడి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరినప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 38.4 శాతం మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తు ఉన్నారు. 21 శాతం మంతి తక్కువ బరువుతో ఉన్నారు. మహిళల్లో ఏకంగా 55 శాత మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లకు ఆహార భద్రతా చట్టంతో చెక్ పెట్టొచ్చని కేంద్రం చెబుతోంది.


