లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు | Pressing Woman Chest Not Attempt to Rape: SC Flags Judicial Sensitivity | Sakshi
Sakshi News home page

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

Jul 15 2026 7:41 AM | Updated on Jul 15 2026 7:45 AM

Pressing Woman Chest Not Attempt to Rape: SC Flags Judicial Sensitivity

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక నేరాల కేసుల్లో న్యాయస్థానాల వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాల తీవ్రతను అర్థం చేసుకోవడంలో న్యాయమూర్తులకు మరింత సున్నితత్వం అవసరమని స్పష్టం చేస్తూ.. నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ కమిటీ రూపొందించిన నివేదికను సుప్రీంకోర్టు, అన్ని హైకోర్టుల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇటీవల పట్నా హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రస్తావించింది.

మహిళ సల్వార్‌ తొలగించడం, ఛాతీపై నొక్కడం వంటి చర్యలు అత్యాచారయత్నంగా పరిగణించలేమని, అవి మహిళ గౌరవానికి భంగం కలిగించే నేరం కిందకు వస్తాయని పట్నా హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఇలాంటి అంశాల్లో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఈ వివాదం అసలు 2025 మార్చి 17న అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మొదలైంది. ఓ బాలిక పైజామా తాడు లాగడం, ఛాతీని పట్టుకోవడం వంటి చర్యలు అత్యాచారయత్నం కిందకు వస్తాయా? అనే కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా విచారణ చేపట్టి.. లైంగిక నేరాల కేసుల్లో న్యాయమూర్తుల సున్నితత్వంపై పరిశీలనకు నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో 2025 జూలై 9న పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి చర్చనీయాంశమైంది. 

2008లో బిహార్‌లోని అమర్‌పూర్‌లో జరిగిన ఓ కేసులో.. ఫొటో స్టూడియో యజమాని ఓ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఫొటో తీసిన తర్వాత ఆమె తండ్రిని బయటకు పంపించి, తలుపు లోపల నుంచి గడియ పెట్టి దాడికి ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. ఆమె కేకలు విని తండ్రి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు కేసు వివరాల్లో ఉంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు నిందితుడిని అత్యాచారయత్నం, అక్రమ నిర్బంధం కింద దోషిగా తేల్చింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు పట్నా హైకోర్టును ఆశ్రయించాడు. 

కేసును పరిశీలించిన హైకోర్టు.. అత్యాచారయత్నాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు లేవని పేర్కొంది. వైద్య ఆధారాలు లేకపోవడం, దర్యాప్తు అధికారిని విచారణలో ప్రవేశపెట్టకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. అయితే బాధితురాలిపై బలవంతంగా దాడి చేయడం, సల్వార్‌ తొలగించేందుకు ప్రయత్నించడం, ఛాతీపై నొక్కడం వంటి చర్యలు మహిళ గౌరవానికి భంగం కలిగించే నేరం కిందకు వస్తాయని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు అత్యాచారయత్నం కింద ఉన్న శిక్షను రద్దు చేసి, సంబంధిత సెక్షన్‌ కింద పరిగణించాలని సూచించింది.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా.. పట్నా హైకోర్టు తమ గత ఆదేశాలను పరిగణనలోకి తీసుకుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడుతూ.. న్యాయమూర్తులు కూడా తీర్పులు ఇచ్చే ముందు సంబంధిత అంశాలపై అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. లైంగిక నేరాల కేసుల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం నుంచి చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు న్యాయ సున్నితత్వానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ నివేదికను అన్ని కోర్టులకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

మహిళలపై లైంగిక నేరాల విచారణలో చట్టపరమైన ప్రమాణాలు, బాధితుల వాంగ్మూలాల ప్రాధాన్యత, నేర తీవ్రతను అర్థం చేసుకునే విధానం.. ఈ మూడు అంశాలపై న్యాయ వ్యవస్థలో మరోసారి చర్చ మొదలైంది. తాజా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement