ఏ'మీ మాంస'కృత్తులు? | Protein has become very popular in recent times | Sakshi
Sakshi News home page

ఏ'మీ మాంస'కృత్తులు?

Jul 15 2026 3:31 AM | Updated on Jul 15 2026 3:31 AM

Protein has become very popular in recent times

ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి ప్రొటీన్‌ 

ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెడుతున్న ప్రజలు 

ప్రొటీన్‌తో కూడిన ఆహారంమంచిదనే భావన 

దీన్ని ఆసరాగా తీసుకుని మార్కెట్‌ శక్తుల మాయాజాలం 

మాంసకృత్తులపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత 

సాక్షి స్పెషల్‌ డెస్క్‌ :  ప్రొటీన్‌ అనే పదం ఇటీవల బాగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్యం కాపాడుకోవడంపై పెరుగుతున్న ఆసక్తి, వివిధ మాధ్యమాల ద్వారా పెంచుకుంటున్న అవగాహన ఇందుకు కారణం. ఫిట్‌నెస్‌ ప్రియులు మొదలుకుని అంతోఇంతో ఆరోగ్య స్పృహ ఉన్నవారు సైతం ప్రొటీన్‌ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. కొందరు వైద్యులు కూడా ఈ ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. మధుమేహానికి మూల కారణమైన కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించాలని, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని అంటున్నారు. 

ప్రొటీన్‌ కండరాల పెరుగుదలకు, బలమైన ఎముకలకు దోహద పడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పప్పుధాన్యాల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధను సొమ్ము చేసుకోవడానికి మార్కెట్‌ శక్తులు పావులు కదుపుతున్నాయి. ప్రొటీన్‌ కోసం ఏం తినాలి అనే విషయంలో కొంత తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. ప్రొటీన్‌ పుష్కలంగా ఉన్న ఆహారాల మీదకు దృష్టిని పోనివ్వకుండా తక్కువ ప్రొటీన్‌ కలిగిన ఆహారాన్ని ‘సూపర్‌ ఫుడ్‌’పేరిట ప్రాచుర్యంలోకి తేవడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్‌ విషయంలో కొన్ని అపోహలు, అసలు వాస్తవాలను ఒకసారి తెలుసుకుందాం.     

అపోహలు, వాస్తవాలు
అపోహ: శాకాహారం అంత ప్రభావవంతంగా ఉండదు 
వాస్తవం: శాకాహారం నుంచి అందే ప్రొటీన్లతో కండరాలను పెంచుకోవడం సాధ్యం కాదని, ఆరోగ్య పరిరక్షణకు అంతగా దోహదపడదనే అభిప్రాయంలో ఏ మాత్రం నిజం లేదు. మొక్కల ప్రోటీన్లు అసంపూర్ణంగా (అన్ని రకాల అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లను తయారు చేయడానికి సహాయపడే ప్రాథమిక అణువులు) లేకపోవడం) ఉంటాయనేది నిజమే. కానీ అన్ని రకాల అమైనో ఆమ్లాలను ఒకే ఆహార పదార్థం నుండి పొందవలసిన అవసరం లేదు. ధాన్యాలు, పప్పుధాన్యాలు, నట్స్‌ (గింజలు), విత్తనాలను కలిపి లేదా మార్చి మార్చి వినియోగించడం ద్వారా సంపూర్ణమైన అమైనో యాసిడ్‌లను పొందవచ్చు. 

అపోహ: ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకుంటే కండరాలు వాటంతట అవే పెరుగుతాయి 
వాస్తవం: ప్రొటీన్‌ కండరాల నిర్మాణం, మరమ్మతు, జీవక్రియలకు మూలమే. కానీ అది ఒక్కటే సరిపోదు. ప్రొటీన్‌తో పాలు అవసరమైన మేరకు కేలరీలు, వ్యాయామం కూడా అవసరం. 

అపోహ: శరీరం ఒక భోజనంలో కేవలం 30 గ్రాముల ప్రొటీన్‌ మాత్రమే తీసుకోగలుగుతుంది 
వాస్తవం: మనిషి తీసుకునే ప్రొటీన్‌ అంతటినీ శరీరం గ్రహిస్తుంది. అయితే కండరాల ప్రొటీన్‌ సంశ్లేషణ విషయంలో మాత్రమే 30 నుంచి 40 గ్రాముల పరిమితి ఉంది. కానీ కండరాల ఉత్తేజితానికి పోగా మిగతా ప్రొటీన్‌ శరీర క్రియల నిర్వహణ, కణజాలం పరిరక్షణతో పాటు పని చేయడానికి అవసరమైన శక్తిగా ఉపయోగపడుతుంది. 

అపోహ: ప్రొటీన్‌ తీసుకుంటే సరిపోతుంది.. 
వాస్తవం: ప్రొటీన్‌ తీసుకోవడం మంచిదే అయినా అది ఒక్కటే సరిపోదు. పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే ఆహారం కూడా అవసరం. 

అపోహ: బాదం గింజలు తీసుకుంటే చాలు. రోజూ ఉదయం గుప్పెడు బాదం పప్పులు తింటే శరీరానికి తగినంత ప్రొటీన్‌ అందుతుంది. 
వాస్తవం: గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు (మోనో అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్స్, పాలీ అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌), సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కానీ వీటిలో ప్రొటీన్‌ ఒక మోతాదులోనే ఉంటుంది. సమృద్ధిగా ఉండదు. వందగ్రాముల బాదం పప్పుల్లో 21 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అలాగే 570 మైక్రోగ్రాములకు పైగా కేలరీలు, 50 గ్రాముల కొవ్వులు కూడా ఉంటాయి. శరీరానికి అవసరమైన 30 గ్రాముల ప్రొటీన్‌ బాదం గింజల ద్వారా అందాలంటే ఆ బాదంతో పాటు అందిన 800 కేలరీలను వ్యాయామం లేదా ఇతర దైనందిన కార్యకలాపాల ద్వారా ఖర్చు చేయాలి. 

అపోహ: వ్యాయామం తర్వాత టేబుల్‌ స్పూన్‌ పీనట్‌ బటర్‌ తింటే ప్రొటీన్‌ సమృద్ధిగా అందుతుంది. 
వాస్తవం: పొట్టుతీయని గింజలతో పోలిస్తే పీనట్‌ బటర్‌ కొవ్వు నిండిన ఆహారం అనే చెప్పాలి. టేబుల్‌ స్పూన్‌ పీనట్‌ బటర్‌లో 3.5 లేదా 4 గ్రాముల ప్రొటీన్‌ మాత్రమే ఉంటుంది. అదే సమయంలో దాదాపు 100 కేలరీలు, 8 గ్రాముల ఫ్యాట్‌ ఉంటుంది. ఇది మంచి శక్తినిచ్చే ఆహారమే, కానీ ప్రొటీన్‌ పుష్కలంగా లభించే ఆహారం కాదు. 

అపోహ: స్మూతీల్లో ఒక స్పూన్‌ చియా విత్తనాలు కలిపితే శరీరానికి తగినంత ప్రొటీన్‌ అందినట్లే. 
వాస్తవం: చియా సీడ్స్‌ పోషకాల పరంగా ఒక అద్బుతం. అయితే ఇందులో బాగా ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, జీర్ణమయ్యే పీచు, క్యాల్షియం. టేబుల్‌ స్పూన్‌ (సుమారు 12 గ్రాములు) చియా సీడ్స్‌లో కేవలం 2 గ్రాముల ప్రొటీన్‌ మాత్రమే ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి వీటిని తీసుకోవాలి కానీ ప్రొటీన్‌ కోసం కాదు. 

అపోహ: మాంసం కంటే బ్రోకలీలో ప్రొటీన్‌ ఎక్కువ. 
వాస్తవం: ఇది అందమైన పదాలతో తప్పుదోవ పట్టిస్తున్న సమాచారం. బ్రోకలీలో కేలరీలు, ప్రొటీన్‌ల నిష్పత్తిని బేరీజు వేస్తూ చెబుతుంటారు. కానీ నిజా నికి బ్రోకలీలో కేలరీలు దాదాపుగా లేనట్లే. అలాగని 30 గ్రాముల ప్రొటీన్‌ల కోసం బ్రోకలీ తినాలంటే రోజుకు కిలోకు పైగా పచ్చి బ్రోకలీ తినాలి. బ్రోకలీని విటమిన్‌లు, పీచు కోసం తినాల్సిందే. ప్రొటీన్‌ కోసం బ్రోకలీ అనేది హాస్యాస్పదం. 

అపోహ: వరి అన్నం బదులు క్వినోవా అన్నం తినడం వల్ల ఎక్కువ మోతాదులో ప్రొటీన్‌ అందుతుంది. 
వాస్తవం: క్వినోవా 9 రకాలైన అమైనో యాసిడ్‌లు అందే ప్లాంట్‌ ప్రొటీన్‌ ఉన్న అద్భుతమైన ఆహారం. గింజల్లో ఇలా సమగ్రమైన ప్రొటీన్‌ అరుదు. కానీ ఇది ప్రధానంగా కార్బోహైడ్రేట్‌ ఆహారం. వంద గ్రాముల క్వినోవా అన్నంలో 4.4 గ్రాముల ప్రొటీన్‌ ఉంటే 21 గ్రాముల కార్బొహైడ్రేట్‌లు ఉంటాయి. 

దేనిలో ఎంత ప్రొటీన్‌ ఉంది? 
1. చికెన్‌ ఛాతీ: వంద గ్రాముల చికెన్‌ (ఛాతీ) బ్రెస్ట్‌లో 31 గ్రాములు ప్రొటీన్‌ ఉంటుంది.  
2. పనీర్‌: వంద గ్రాముల పనీర్‌లో 18 నుంచి 23 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. 
3. పెద్ద కోడిగుడ్డు: ఇందులో ఆరు గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. తెల్లసొనలో ప్రొటీన్, పసుపు సొనలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, కొవ్వులో కరిగే విటమిన్‌లు ఉంటాయి. 
4. సోయా ముక్కలు: వందగ్రాముల ఎండిన సోయా ముక్కల్లో (చంక్స్‌/మీల్‌మేకర్‌) 52 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. ఇందులో అమైనో యాసిడ్‌లు కూడా సమృద్ధిగా ఉంటాయి. 
5. పప్పుధాన్యాలు: ఉడికించిన వందగ్రాముల పప్పులో పీచుతో కూడిన ప్రొటీన్‌ 9 గ్రాములు ఉంటుంది. 

ఏం తింటే మంచిది? 
మార్కెట్‌ మాయాజాలంలో పడకుండా ఆహారంలో ఏమేమి ఉండేలా చూసుకోవాలనేది.. ఎవరికి వారు తమ దైనందిన కార్యకలాపాలు, వ్యాయామం, వయసు, శరీరం తీరు, జీవక్రియల తీరు ఆధారంగా నిర్ణయించుకోవాలి 
» కొవ్వు లేని మాంసం, చేపలు, గుడ్లు, పనీర్, టోఫు (సోయా పనీర్‌), సోయా తగిన పాళ్లలో ఉండాలి. 
»   గింజలు, కాయధాన్యాలు, క్వినోవా, ఆకు కూరలు, కూరగాయలతో సమతుల ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, సమగ్రమైన కార్బోహైడ్రేట్‌లు, సూక్ష్మ పోషకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement