టెక్ బిలియనీర్, దీర్ఘాయువు ప్రచారకర్త బ్రయాన్ జాన్సన్ తన స్నేహితురాలు కేట్‌కు శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఏళ్ల తరబడి స్కానింగ్‌ల తర్వాత ఏఐ సహాయక ఎంఆర్‌ఐ విశ్లేషణలో ఎండోమెట్రియోసిస్‌ని సులభంగా నిర్థారించిదని వెల్లడించారు. శస్త్ర చికిత్స లేకుండా నిర్థారించలేని ఈ సమస్యను తాము ఏఐ ఆధారిత స్కానింగ్, బహుళ రక్త పరీక్షల సాయంతో నిర్థారించామని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఎండోమెట్రియోసిస్?, ఈ సమస్యను గుర్తించడంలో ఏఐ ప్రత్యామ్నాయంగా ఉంటుందా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.
ఎండోమెట్రియోసిస్ అంటే..
ఇది మహిళల్లో కనిపించే ఒక సాధారణ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఇందులో, గర్భాశయం లోపలి పొరను పోలి ఉండే కణజాలం (ఎండోమెట్రియం) గర్భాశయం వెలుపల.. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు, లేదా పొత్తికడుపులోని ఇతర అవయవాలపై పెరగడం ప్రారంభమవుతుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల వాపు, మచ్చలు, తీవ్రమైన కటి నొప్పి కలుగుతాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీని బారిన పడుతున్నారని అంచనా. దీని కారణంగా మహిళలు ఈ కింది సమస్యలు ఎదుర్కొంటారు.
లక్షణాలు..
నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి
రుతుస్రావం సమయంలో లేదా సంభోగం సమయంలో విపరీతమైన నొప్పి
అధిక రక్తస్రావం (హెవీ పీరియడ్స్)
వంధ్యత్వం (గర్భం దాల్చడంలో ఇబ్బందులు)
దీన్ని నిర్థారించడం ఎందుకంత కష్టం అంటే..
ఈ సమస్య లక్షణాలు తరచుగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), పెల్విక్ ఇన్‌ప్లమేటరీ డిసీజ్ లేదా అండాశయ తిత్తులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో కలిసి ఉంటాయి. ఫలితంగా, చాలా మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ కావడానికి 6 నుంచి 10 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి వస్తుంది.
సాధారణ స్కాన్‌లు గుర్తించలేకపోవడానికి రీజన్..
ఇక్కడ బ్రయాన్ జాన్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ కేట్ మొదటగా ఎమ్మారై, ట్రాన్స్‌వజైనల్ అల్ట్రాసౌండ్ చేయించుకుందని చెప్పారు. కానీ ఈ రెండూ ఆ వ్యాధిని గుర్తించడంలో విఫలమయ్యాయని చెప్పారు. నిజానికి సాధారణ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా ఎండోమెట్రియోసిస్ గాయాలను గుర్తించడం కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు.
అండాశయాలు లేదా లోతైన పెల్విక్ కణజాలాలను ప్రభావితం బాగా ప్రభావితం చేసే ముదిరిన పరిస్థితుల్లోనే సాంప్రదాయ స్కానింగ్‌లో దీన్ని గుర్తించగలరట. అదీగాక దశాబ్దాలుగా, ఎండోమెట్రియోసిస్‌ను నిర్ధారించడానికి లాపరోస్కోపీని (వైద్యులు పెల్విక్ కుహరాన్ని నేరుగా పరీక్షించడానికి వీలు కల్పించే అతి తక్కువ కోతతో చేసే శస్త్రచికిత్సా విధానం) అత్యుత్తమ ప్రమాణంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఏఐ ఆధారిత అధిక నాణ్యత ఇమేజింగ్ ఆ కోతను కూడా తగ్గించి సులభంగా ఈ సమస్యను గుర్తించడం విశేషం.
కృత్రిమ మేధ (AI) రోగ నిర్ధారణను మెరుగుపరచగలదా?
మహిళల ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ ఒక ఆశాజనకమైన సాధనంగా ఆవిర్భవించనుంది. పెల్విక్ MRI స్కాన్‌లను విశ్లేషించడానికి, రేడియాలజిస్టులు కూడా గమనించలేని సూక్ష్మమైన నమూనాలను గుర్తించడానికి AI అల్గారిథమ్‌లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ సాంకేతికత లోతుగా చొచ్చుకుపోయే ఎండోమెట్రియోసిస్‌ను గుర్తించడంలో చక్కటి మెరుగుదలను అందిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడ జాన్సన్ AI-సహాయక ఇమేజింగ్, ఎండోమెట్రియోసిస్-నిర్దిష్ట అల్ట్రాసౌండ్‌తో పాటు వివధ రక్త పరీక్షల ఆధారంగా ఈ సమస్యను నిర్థారించినట్లు తెలిపారు. అందువల్ల ఇది కచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని చెప్పలేమని..ఇంకా పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అంటున్నారు. అందువల్ల తాము ఏఐ సాధనం గైనకాలజిస్ట్ నిపుణుడికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోండని హెచ్చరిస్తున్నారు.
ప్లీజ్ ఈ విషయాలన్ను విస్మరించొద్దు..
అందుకనే మహిళలు ఎండోమెట్రియోసిస్‌ను సూచించే లక్షణాలు ఉంటే, కేవలం ప్రాథమిక స్కాన్ ఆధారంగా నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. ఎండోమెట్రియోసిస్ విషయంలో అనుభవం ఉన్న గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు.
ఇక్కడ జాన్సన్ చెబుతోంది దీర్ఘకాలిక కటి నొప్పితో బాధపడుతున్న లక్షలాది మంది మహిళలకు, ఈ ఆవిష్కరణలు ముందస్తు నిర్థారణకు, అలాగే తక్కువ బాధతోనే త్వరితగతిని వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశానికి వీలు కల్పిస్తుందనే ఆశను అందిస్తుందే తప్ప..దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: కేన్సర్‌తో పోరాడుతూ షూటింగ్‌లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..)


