సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని అమలుచేయని ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తగినన్ని పాఠ్యపుస్తకాలు, తగు సంఖ్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకుండా హఠాత్తుగా ఈ విధానాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.
కొత్తగా ప్రవేశపెట్టిన భాషలను బోధించని ఉపాధ్యాయులపై యాజమాన్యాలు ఏవైనా చర్యలు తీసుకుంటే బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఒక వేళ విధుల్లోంచి తొలగిస్తే అందుకు సంబంధించిన ఆదేశాలపై స్టే విధిస్తామని సీజేఐ తెలిపారు. త్రిభాషా విధానం ఆకస్మిక అమలు, వనరుల లేమిపై వివరణ ఇవ్వాలని సీబీఎస్‌ఈని ఆదేశించారు.
విద్యార్థులపై అదనపు భారం..
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020, నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్–2023కి అనుగుణంగా సీబీఎస్‌ఈ మే 15న ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం 2026 జూలై నుంచి ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలి. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా దీనిని అమలు చేయడం విద్యార్థులపై అదనపు భారం మోపడమేనంటూ కొందరు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని పిటిషన్లలో పేర్కొన్నారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆనంద్ గ్రోవర్, గోపాల్ శంకర్ నారాయణన్, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ చదివే 14 ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యారి్థకి అకస్మాత్తుగా తమిళం నేర్చుకోమని చెబితే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ఎక్కడి నుంచి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం సీబీఎస్‌ఈకి నోటీస్ జారీచేసి కేసును 29వ తేదీకి వాయిదావేసింది.


