ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల్లో ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడాలనడంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పెట్రోల్ పంపుల్లో స్వచ్ఛమైన పెట్రోల్, ఈ20 పెట్రోల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వాహన యజమానులకు అందుబాటులో ఉండాలన్నారు. తక్కువ మైలేజీ ఇస్తుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ20 పెట్రోల్ ధరను తగ్గించాలని కేజ్రీవాల్ కోరారు. వినియోగదారుల గళం వినిపించేందుకు తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.
ఈ మేరకు కేజ్రీవాల్ మంగళవారం ఒక లేఖ రాశారు. వివిధ వర్గాల ప్రజలను కలిసినప్పుడు వ్యక్తమైన అభిప్రాయాలు, ఇందులో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను ప్రధాని మోదీకి వివరిస్తానన్నారు. ‘2023కు ముందు తయారైన 30 కోట్ల రిజిస్టర్డ్ ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుకూలంగా లేవు.
ఈ వాహనాల ఓనర్ మాన్యువల్స్‌లో సాధారణంగా స్వచ్ఛమైన పెట్రోల్, కొన్ని సందర్భాల్లో ఈ10 పెట్రోల్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారని, ఈ20 పెట్రోల్‌ను కాదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభిస్తే వీటిని కూడా ఆయనకు చూపెడతానని చెప్పారు.


