అమెజాన్‌ డేటా సెంటర్‌కు నేడు సీఎం శంకుస్థాపన | Telangana CM to lay foundation stone for Amazon Web Services data centre | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ డేటా సెంటర్‌కు నేడు సీఎం శంకుస్థాపన

Jul 15 2026 5:30 AM | Updated on Jul 15 2026 5:30 AM

Telangana CM to lay foundation stone for Amazon Web Services data centre

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు.. 24 నెలల్లో పూర్తికానున్న నిర్మాణ పనులు 

రాష్ట్రంలో డేటా సెంటర్ల విస్తరణకు రూ.60 వేల కోట్లు వెచ్చించనున్న సంస్థ   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూ­చర్‌ సిటీలో అమెజాన్‌ నూతన డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ కేంద్రంగా సర్వే నంబర్‌ 120లో 48 ఎకరాల్లో అమెజాన్‌ డేటా సెంటర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజాగా అదే ప్రాంతంలో సేవలను విస్తరించనుంది. బుధవారం మధ్యాహ్నం 12:15 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి చేరుకొని అమెజాన్‌ నూతన డేటా సెంటర్‌ భూమిపూజ నిర్వహించనున్నారు.

ఈ డేటా సెంటర్‌ నిర్మాణ పనులు 24 నెలల్లో పూర్తి కానున్నాయి.2025 జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు సందర్భంగా అమెజాన్‌ ప్రతినిధులతో చర్చించిన సీఎం రేవంత్‌.. తెలంగాణలో డేటా సెంటర్ల విస్తరణ కోసం రూ. 60 వేల కోట్ల పెట్టుబడికి అమెజాన్‌ బృందాన్ని సూత్రప్రాయంగా ఒప్పించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది.

2025 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా అమెజాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.125 కోట్ల విలువచేసే ప్రోత్సాహకా­­లు, రాయితీలను అమెజాన్‌కు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సీఎం ఆదేశాల మేరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 202 ఎకరాలతోపాటు చందన్‌వెల్లిలో 98 ఎకరాలను అమెజాన్‌కు కేటాయించారు. అమెజాన్‌ నూతన డేటా సెంటర్‌ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్లలో ఒకటిగా హైదరాబాద్‌ నిలవనుంది.

మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో పర్యటన 
సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు. అమెజాన్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపన అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్‌లో సెల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ ప్రారంబోత్సవానికి హాజరవుతారు. 3 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవ­నం ప్రారంబోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement