టెట్‌లో 14,814 మంది ఉపాధ్యాయులు ఫెయిల్
ఏళ్లుగా ఒకే సబ్జెక్టులో బోధన.. అన్నింటిపై పట్టు ఎలా సాధ్యమని ఉపాధ్యాయుల ప్రశ్న
అసలు పరీక్షే అశాస్త్రీయం అంటున్న సంఘాలు
పాత తరం టీచర్లకు టెట్ కొంత కష్టంగా ఉంటోందనే అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లే.. పరీక్షలో ఫెయిలయ్యారు. విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో సర్వీస్‌లో ఉన్న టీచర్లు 14,814 మంది ఫెయిల్ కావడం విస్మయం కలిగిస్తోంది. మొత్తం 23,623 మందికి 8,809 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించే టీచర్లు కూడా పెద్ద మొత్తంలో అర్హత సాధించలేకపోవడం గమనార్హం. కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసినవారు 45.66 శాతం టెట్ పాసయితే, ప్రభుత్వ బడుల్లో పాఠాలు చెప్పే టీచర్లు మాత్రం 37.29 శాతం మాత్రమే అర్హత సాధించారు. సైన్స్ సబ్జెక్టులో 38.27 శాతం పాసయితే, సోషల్ స్టడీస్ పేపర్ రాసిన వారిలో కేవలం 24.05 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
అత్యున్నత న్యాయ స్థానం ప్రతి ఉపాధ్యాయుడూ టెట్ అర్హత కలిగి ఉండాలనే నిబంధన విధించింది. అయితే తమకు దీన్నుంచి మినహాయింపు ఇవ్వాలని టీచర్ సంఘాలు ఢిల్లీ వరకు పోరాటం చేశాయి. మొత్తం మీద ఇన్ సర్వీస్ టీచర్లకు ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించే మినహాయింపు మాత్రం లభించింది. దీంతో తాజాగా అందరితో కలిసి టెట్ రాస్తే టీచర్ల ఉత్తీర్ణత 50 శాతం మించలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే అర్హత పరీక్షలో ఫెయిల్ అయితే విద్యా ప్రమాణాల మాటేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే తమకు తమ సబ్జెక్టుకు సంబంధించిన పరిజ్ఞానం ఉంటుంది తప్ప ఇతర అంశాల్లో ఎలా ఉంటుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఆప్‌డేట్ కాని టీచర్లు?
రాష్ట్రవ్యాప్తంగా 1.06 లక్షల ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. వీరిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసవ్వని వాళ్ళు గత ఏడాది వరకూ 40 వేల మంది ఉన్నారు. తాజాగా ఉత్తీర్ణులైన వారిని తీసివేస్తే 30 వేల మంది వరకూ టెట్ అర్హత లేదు. వీరంతా దశాబ్దాల క్రితం బీఎడ్ పాసైన వాళ్లు కావడం గమనార్హం. అప్పట్లో ఉన్న బోధన విధానం వేరని, ఇప్పుడు అంతా మారిపోయిందని అంటున్నారు. గణితంలో లీటర్ పాలల్లో అర లీటరు నీళ్ళు కలిపితే లాభమా? నష్టమా? నష్ట, లాభ శాతం ఎంత? ఇలాంటి లెక్కలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. నవీన పోకడలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు వచ్చాయి. కంప్యూటర్ ఆధారిత మేథమెటిక్స్ ప్రవేశ పెడుతున్నారు. కానీ ప్రభుత్వ టీచర్లు వాళ్ళు బీఈడీ చేసినప్పుడు విధానాలనే అనుసరిస్తున్నారని, ఇది ప్రభుత్వ స్కూళ్ళల్లో బోధనపై, అలాగే వారు అప్‌డేట్ కావడంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు.
ఇతర సబ్జెక్టులపై పట్టు ఎలా?
తాము బీఈడీ చేసి, టీచర్‌గా చేరిన తర్వాత క్లాస్ రూంలో ఏదో ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితం అవ్వాల్సి ఉంటుందని టీచర్లు చెబుతున్నారు. ఏళ్ళ తరబడి అదే సబ్జెక్టుపై కసరత్తు చేస్తున్నామని, కానీ టెట్‌లో అన్ని సబ్జెక్టులతో పాటు, జాతీయ విద్యా విధానం తీసుకొచ్చే మార్పులు తదితర అంశాలు కూడా చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. విద్యార్థుల మనస్తత్వ శాస్త్రం నుంచి వచ్చే ప్రశ్నలు తామెప్పుడూ చూడలేదంటున్నారు. పరీక్షలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఉంటోందని, 8వ తరగతి నుంచి పుస్తకాలు చదివితే తప్ప, టెట్ రాయడం కష్టమని చెబుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగంలో చేరిన తర్వాత ఇతర సబ్జెక్టులపై ఎందుకు పట్టు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్న ‘న్యాస్’
గత ఏడాది చేపట్టిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్)లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు నానాటికీ తగ్గిపోతున్నాయని తేలింది. సర్వేలో భాగంగా న్యాస్ వేసిన ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. మూడవ తరగతి లాంగ్వేజ్‌లో 68 శాతం, గణితంలో 69, 5వ తరగతి లాంగ్వేజ్‌లో 57 శాతం, గణితంలో 56 శాతం మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చారు. 28 అంశాలపై విద్యార్థులకు పరీక్ష పెడితే 18 అంశాల్లో 80 శాతం సమాధానాలు సరైనవి ఇవ్వలేపోయారు. 8, 9, 10 తరగతుల్లో విద్యార్థులు సైన్స్, గణితంతో పాటు సామాజిక అంశాల్లోనూ ఏమాత్రం ప్రావీణ్యం చూపలేకపోయారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు బోధన ఎలా జరుగుతోందనేది తెరపైకి వచ్చింది. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ శిక్షణ తరగతులు నిర్వహించినా, టీచర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన మెళకువలు నేర్చుకోవడంలో ఉపాధ్యాయులు వెనుకబడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సబ్జెక్టు, డిజిటల్ విద్య పాత తరం టీచర్లకు కొంత ఇబ్బందిగానే ఉంటోందని అంటున్నారు.
శక్తికి మించిన సిలబస్ ఇవ్వడం వల్లే..
బోధించే సబ్జెక్టులో టీచర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాలి. కానీ టెట్‌లో ఇతర పోర్షన్‌ను ఇస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఏదో ఒక సబ్జెక్టులో నిష్ణాతుడు. అతని సబ్జెక్టు నుంచి వచ్చే ప్రశ్నలు తక్కువ. ఇతర ప్రశ్నలు ఎక్కువ. హిందీ టీచర్‌ను గణితం ప్రశ్నలు అడిగితే ఎలా రాయగలడు. ఇది మార్చమని కోరాం. అధికారులు స్పందించలేదు.
– పులగం దామోదర్ రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు)
ఇది అశాస్త్రీయం:
సిలబస్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది. ఇది మార్చాలని కోరాం. కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం తేల్చిందో తెలియదు. క్వాలిఫై మార్కుల విషయంలోనూ మార్పులు అవసరం. ఏ సబ్జెక్టు బోధిస్తాడో అదే సబ్జెక్టులో టెట్ నిర్వహించాలి. మేథ్స్‌పై ఆసక్తి లేని వ్యక్తే ఇంటర్‌లో బైపీసీలో చేరతాడు. అదే సబ్జెక్టులో టీచర్ అవుతాడు. ఇప్పుడు మేథ్స్ రాయమంటే ఎలా? టీచర్లను దోషిగా నిలబట్టే టెట్ పరీక్ష విధానం మార్చాలి.
– చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు)


