వీణవంక మండలం ఘన్ముక్కుల స్కూల్లో దుస్థితి
వీణవంక (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోతోంది. హెచ్‌ఎంతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్‌పై ఇతర స్కూల్‌కు వెళ్లారు. దీంతో హెచ్‌ఎంతో కలిపి ఏడుగురు ఉపాధ్యాయులుండగా.. విద్యార్థులు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. 6వ తరగతిలో ఇద్దరు, ఏడులో ఒకరు, ఎనిమిదిలో ఇద్దరు, తొమ్మిదిలో ఒకరు, పదిలో ముగ్గురు విద్యార్థులున్నారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోర్డుతో పాటు అన్నీ మౌలిక వసతులున్నా విద్యార్థుల్లేరు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా లేకున్నా ఉపాధ్యాయులు మాత్రం కొలువు తీయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఒకప్పుడు ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొంది ఇప్పుడు విద్యార్థుల్లేని దుస్థితి నెలకొంది. పాఠశాలకు ఆనుకొని కూత వేటు దూరంలో మోడల్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలను అందులో కలపాలని అధికారులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై హెచ్‌ఎం శ్రీనివాస్‌ను వివరణ కోరగా వేసవి సెలవుల్లో ఇంటింటికీ తిరిగాము కానీ విద్యార్థులు రాలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎంఈవో శోభారాణిని వివరణ కోరగా గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో మోడల్ స్కూల్ ఉందని, దీంతో విద్యార్థులు ఆ స్కూల్‌కే వెళ్తున్నారని అందుకే సంఖ్య తగ్గిందని తెలిపారు.


