నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయికి కలెక్టర్లు
ఒక్కో జిల్లాలో.. ఒక్కో వినూత్న శైలి
ఎంచుకున్న రంగాలపై ప్రత్యేక ఫోకస్.. తమదైన ముద్ర
నిర్ణయాల్లో వేగం, జవాబుదారీ తనం, పారదర్శకతకు పెద్దపీట
మెరుగైన సేవలు.. కలెక్టరేట్‌కు వచ్చే సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించేలా కృషి
ఫిర్యాదుల డిజిటలైజేషన్‌కు హెల్ప్‌డెస్క్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సంప్రదాయ కార్యాలయ పరిపాలన నుంచి ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ (క్షేత్రస్థాయి పాలన) వైపు కలెక్టర్లు అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. శాఖల మధ్య సమన్వయం పెంచడం.. ప్రభుత్వ యంత్రాంగాన్ని బాధ్యతాయుతంగా పనిచేయించే వ్యవస్థను బలోపేతం చేయడం.. సాంకేతికత వినియోగంతో సేవల సులభతరం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని వినూత్న ఆలోచనలతో మెరుగైన పాలనకు శ్రీకారం చుడుతున్నారు. మూస ధోరణికి స్వస్తి పలికి పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ తాము ఎంచుకున్న విభాగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. తమదైన శైలిలో ముందుకుసాగుతున్నారు. జిల్లాలు వేరు, సమస్యలు వేరు, ప్రాధాన్యతలు వేరు.. అయినా లక్ష్యం ఒక్కటే అంటూ గుడ్ గవర్నెన్స్ దిశగా తమదైన ముద్ర వేసుకున్న పలువురు ఐఏఎస్‌లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..
యాదాద్రి: ప్రజావాణి సంస్కరణ
గ్రీవెన్స్ సెల్ అర్జీలకు ఆయా ప్రభుత్వ శాఖల సమన్వయంతో సత్వర పరిష్కారం చూపేలా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదుదారుల సమస్యపై వారి ఎదుటే స్పష్టత ఇవ్వడం.. ఆ తర్వాత నిర్ణయం అమలు చేసేలా ‘యూ’ఆకృతిలో అధికారులకు సీట్లు ఏర్పాటు చేశారు. మండలాలు, మున్సిపాలిటీల ఫీల్డ్ స్టాఫ్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ కలెక్టరేట్‌కు వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఫిర్యాదులను డిజిటలైజేషన్‌చేసేందుకు హెల్ప్ డెస్క్ పేరిట కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు ద్వారా దరఖాస్తుదారులకు రశీదు ఇస్తున్నారు, ఆ ఫైల్ ఏ దశలో ఉందో సులభంగా ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా దళారుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా సంబంధిత అధికారులను కలిసి సమస్యలను వివరించేలా ప్రతి డెస్క్ వద్ద అధికారి పేరు, హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారు. 
నిజామాబాద్: పాఠశాల విద్యపై ఫోకస్
ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఔపోసన సామర్థ్యాలను పెంచడంతోపాటు మౌలిక వసతుల కల్పనపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వారంలో ఒకట్రెండు రోజులు ఆకస్మికంగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలల వారీగా తాగునీరు, ట్యాంకులు, టాయిలెట్లు, తరగతి గదులు, భోజన వసతి వంటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. మౌలిక వసతులు సరిగా లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించిన త్రిపాఠి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి రూ.21 కోట్లు కేటాయించారు. పీఎంశ్రీ కింద ఎంపికైన స్కూళ్లకు మరో రూ. 36 లక్షలు, నిర్వహణ కింద ఒక్కో పాఠశాలకు రూ.10 వేల చొప్పున మంజూరు చేశారు. పొలాలు, గ్రామాల శివారులోని పాఠశాలల్లో పాముల బెడద నివారణకు మెష్‌లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు.
జనగామ: మహిళా సాధికారత, విద్య, వ్యవసాయం
అడ్మిని్రస్టేషన్ పరంగానే కాకుండా సామాన్యుల గోస వినే అధికారిగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేరు తెచ్చుకున్నారు. జనగామకు చెందిన దివ్యాంగుడు పర్శ సాయి తల్లిదండ్రులు తమ సమస్యను వివరించిన గంటలోగా టాటా ఏస్ వాహనం కొనుగోలుకు రూ.4 లక్షల రుణ చెక్కు అందించారు. రాష్ట్రంలో తొలిసారిగా 62 మంది మహిళలకు రైతు సేవా కేంద్రాలు (ఎరువుల షాప్‌లు) కేటాయించి ఒక్కో యూనిట్‌కు రూ.5 లక్షల రుణం అందించారు. డీఆర్‌డీఏ–సెర్ప్, వ్యవసాయ శాఖల సమన్వయంతో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఫాస్ట్ మ్యాథ్స్–కంప్లీట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా అకడమిక్ ఎక్సలెన్స్ ఇనిíÙయేటివ్ ద్వారా సర్కారు స్కూళ్లలో బోధన, మూల్యాంకన ప్రక్రియను ఏకరీతిలో అమలు చేస్తున్నారు. నకిలీ సీడ్స్, ధరల నియంత్రణకు నిగ్రాని కమిటీలు ఏర్పాటు చేశారు.
వేగం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే..
ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా ప్రవేశపెట్టిన ఈ సరికొత్త సిస్టం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. పెండింగ్ సమస్యలను పూర్తిగా సున్నాకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం. భవిష్యత్‌లో దరఖాస్తుదారుడే స్వయంగా తన అప్లికేషన్ స్థితిని తెలుసుకునేలా శాశ్వత కౌంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నాం.
– అనురాగ్ జయంతి, కలెక్టర్, యాదాద్రి భువనగిరి
పాఠశాలల బలోపేతానికి ప్రాధాన్యం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా వసతులు మెరుగుపర్చి విద్యార్థులకు మెరుగైన విద్యనందించడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే మెరుగుపరుస్తున్నాం. అన్ని స్కూళ్లలో ప్రతి రోజు తాగునీరు, టాయిలెట్ల నిర్వహణతోపాటు ప్రతి శుక్రవారం పారిశుధ్య పనులు చేపడుతున్నాం.
– ఇలా త్రిపాఠి, కలెక్టర్, నిజామాబాద్


