2028 జూన్ 2 నాటికి నిర్మాణం పూర్తిచేయాలి
కాకతీయ సంస్కృతికి అద్దంపట్టేలా డిజైన్లు ఉండాలి
హుస్సేన్‌సాగర్ నుంచి ప్రకాశం బరాజ్ వరకూ సీప్లేన్‌లు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సీఎం రేవంత్‌రెడ్డి వినతి
అత్యుత్తమ కల్చరల్ టెర్మీనల్‌గా వరంగల్: రామ్మోహన్‌నాయుడు
కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్న రేవంత్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వ్యూహాత్మక, వాణిజ్యపరమైన అవసరాల రీత్యా వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఢిల్లీలోని విమానయాన శాఖ కార్యాలయమైన రాజీవ్‌గాంధీ భవన్‌లో రామ్మోహన్ నాయుడితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్ విమానాశ్రయ పనుల గురించి చర్చించారు. రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతోపాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తదితర పరిశ్రమలతో తెలంగాణలో వరంగల్ కీలక నగరంగా ఉందని వివరించారు.
ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు కేంద్రంగా ఉన్న వరంగల్‌ను పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందువల్ల వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ సదుపాయాలను కల్పించాలని కోరారు. ఇప్పటికే భూసేకరణ పూర్తి అయినందున, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. 2028, జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వరంగల్‌కు ఉన్న ఘనమైన కాకతీయ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్లు ఉండాలని భావిస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించగా, రామ్మోహన్ నాయుడు సుముఖత వ్యక్తంచేశారు.
రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్‌లో...
రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో పౌర విమానాశ్రయం నిర్మించాలని రామ్మోహన్‌నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ విమానాశ్రయం మాదిరిగానే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్ వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణ సంస్థలను నెలకొల్పాలని విన్నవించారు. హుస్సేన్‌సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బరాజ్ వరకూ సీప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనికి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందిస్తూ, అందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్, విమానయాన శాఖ కార్యదర్శి సమీర్‌కుమార్ శర్మ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్ కుమార్ పాల్గొన్నారు.
చరిత్రకు అద్దంపట్టేలా డిజైన్: రామ్మోహన్‌నాయుడు
విమానాశ్రయ నిర్మాణానికి సకాలంలో భూసేకరణ పూర్తిచేసి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. భూసేకరణ, ఇతర అంశాల్లో మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ మాదిరే స్పందించాలని చెప్పారు. కాకతీయæ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా వరంగల్ విమానాశ్రయ డిజైన్ ఉంటుందన్నారు. దేశంలోనే అత్యుత్తమ కల్చరల్ టెర్మినల్‌గా నిలుస్తుందన్నారు. అలాగే, రక్షణ శాఖతో సంయుక్తంగా సివిలియన్, డిఫెన్స్ అవసరాల కోసం స్ట్రాటజిక్ లొకేషన్‌గా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని వివరించారు. ఇందుకోసం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డితో కలిసి సమీక్షించినట్లు వెల్లడించారు. అక్కడ 250 ఎకరాల మేర రక్షణ శాఖ భూమి ఉందని, ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన మరో 1,700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు.
విమానాశ్రయాలతో యువతకు ఉపాధి: రేవంత్‌రెడ్డి
భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2028 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాల్లోనే కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వస్తున్నామని, దానిపైనా రాజకీయ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోదీ వికసిత్ భారత్–2047 లక్ష్యంలో తెలంగాణ భాగస్వామ్యం అవుతుందని రేవంత్ చెప్పారు. అదే సమయానికి తెలంగాణను కూడా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయాలనే ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు.


