అధికంగా వసూలు చేసిన ఫీజులు ఇచ్చేయండి | Private schools in Punjab that raised fees by more than 5 per cent annually | Sakshi
Sakshi News home page

అధికంగా వసూలు చేసిన ఫీజులు ఇచ్చేయండి

Jul 15 2026 5:39 AM | Updated on Jul 15 2026 5:39 AM

Private schools in Punjab that raised fees by more than 5 per cent annually

ప్రైవేట్‌ స్కూళ్లకు పంజాబ్‌ ప్రభుత్వం ఆదేశం

చండీగఢ్‌: పంజాబ్‌లో గత మూడేళ్లలో ఏటా 5 శాతానికి మించి ఫీజులను పెంచిన ప్రైవేట్‌ పాఠశాలలు, ఆ అదనపు మొత్తాన్ని తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. విద్యాసంస్థలను లాభాలు ఆర్జించే ఫ్యాక్టరీలుగా మార్చడానికి తమ ఆప్‌ ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పారు.

కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం.. ప్రైవేట్‌ పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులతో పాటు అన్ని రకాల ఛార్జీలతో కలిపి మొత్తం వార్షిక ఫీజును 5 శాతం కంటే ఎక్కువ పెంచడానికి వీల్లేదన్నారు. పాఠశాలలు వేర్వేరు పేర్లతో ఛార్జీలను పెంచి ఈ నిబంధన నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు, ఫీజు పరిధిలోకి ఏం వస్తాయనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించామని సీఎం మాన్‌ తెలిపారు.

ఈ ప్రక్రియ అమలులో భాగంగా ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు గత నాలుగేళ్ల ఫీజుల రికార్డులను పది రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ఆ తర్వాత విద్యాశాఖ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒక నెల రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించే బడులకు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. అయినా దారికి రాకుంటే ఆయా స్కూళ్ల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫీజులను సర్దుబాటు చేస్తామంటే అంగీకరించబోమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement