విద్యార్థుల నుంచి ఫీజుల వసూలొద్దు | Deadline for payment of fees for new admissions extended to August 15th | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నుంచి ఫీజుల వసూలొద్దు

Jul 10 2026 1:20 AM | Updated on Jul 10 2026 1:20 AM

Deadline for payment of fees for new admissions extended to August 15th

గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు 

వచ్చే నెల 20 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి 

అడ్మిషన్లను కాలేజీలు యథావిధిగా కొనసాగించాలి 

‘ద్వితీయ, తృతీయ, నాలుగో’విద్యార్థులూ వివరాలివ్వాలి  

ఈ నెల 31లోగా ఈ విద్యార్థుల ఫీజు చెల్లించాలన్న హైకోర్టు 

కొత్త అడ్మిషన్ల ఫీజు చెల్లింపునకు ఆగస్టు 15 వరకు గడువు విధింపు 

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి జీవో నంబర్‌–9లోని నాలుగు మార్గదర్శకాలపై ఇచ్చిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 2026–27 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఆగస్టు 15 వరకు అడ్మిషన్ల (తొలి ఏడాది) విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామని.. ఈ నెలాఖరులోగా ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఈ మేరకు ఉపశమనం ఇచ్చింది. ప్రవేశాలు యథావిధిగా కొనసాగించాలని కాలేజీలకు చెప్పింది.

ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల వివరాలను వారం రోజుల్లో సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అనంతరం ప్రభుత్వం నిధుల విడుదల చర్యలు చేపట్టి.. జూలై 31లోగా ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఇక మొదటి ఏడాది విద్యార్థులకు ఆగస్టు 15 డెడ్‌లైన్‌ విధించింది. ఆలోగా తొలిదశ ఫీజు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఆ తర్వాత కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. గురువారం సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 6న జారీ చేసిన జీవో 9ను సవాల్‌ చేస్తూ 100కుపైగా కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇది గత ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నాయి. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. జీవో నంబర్‌ 9లోని నాలుగు పేరాలపై గత నెల స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రవేశాలు ప్రారంభమైన నేపథ్యంలో స్టే ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం వెకేట్‌ స్టే పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. 

ఏళ్లుగా బకాయిలు పెడితే కాలేజీలు ఎలా నడపాలి.. 
కాలేజీల తరఫున న్యాయవాదులు వాదిస్తూ ‘విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు చెప్పిన తర్వాత.. ప్రభుత్వం ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 7 తెచ్చింది. జీవో 7పై స్టే ఇస్తే.. జీవో 8, 9 తీసుకొచ్చింది. వాటిపైనా స్టే ఇవ్వడంతో వెకేట్‌ పిటిషన్‌ వేసింది. ఇదంతా చేసిన ప్రభుత్వంపై మాకు నమ్మకం ఎలా ఉంటుంది? విద్యార్థుల భవిష్యత్‌ కోసం అని చెబుతున్న ప్రభుత్వం.. తొలి దశగా రూ. 1,500 కోట్లు కూడా విడుదల చేయలేదా? ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న ఫస్ట్‌ ఇయర్‌ వారికి ఇస్తామంటే.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? ఆగస్టు 27 వరకు చివరి అడ్మిషన్లకు అవకాశం ఉంది. 

ఒకవేళ ఆగస్టు 15న ప్రభుత్వం చెల్లిస్తే ఆ తర్వాత విద్యార్థులు చేరొచ్చు. జీవోపై స్టే ఉపసంహరించవద్దు. ఒకవేళ స్టేను సడలిస్తే అడ్మిషన్లకు సంబంధించి చెల్లింపుపై ఆగస్టు 19 వరకే అవకాశం ఇవ్వండి. అప్పటిలోగా కాలేజీలకు చెల్లించని పక్షంలో ఆగస్టు 20 నుంచి కాలేజీలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేలా ఆదేశించండి’అని కోరారు. అనంతరం ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ‘అన్ని సంవత్సరాల విద్యార్థుల కోసం రూ. 250 కోట్లు విడుదల చేస్తున్నాం. 

తొలి దశలోని మిగతా ఫీజు ఆగస్టు 15న విడుదల చేస్తాం. ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్‌ ఇస్తామని కాలేజీలు చెబితే.. పేద విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలో పడుతుంది. ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజుల చెల్లింపుపైనా ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకుంటాం. గతంలో ఇచ్చిన మధ్యంతర స్టేను సడలించి.. ఉపశమనం కల్పించాలి’అని విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement