నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీబాబు
పోస్టర్లు అతికించిన యువకుడు
నిందితుడు సహా ఆరుగురి అరెస్ట్
సిద్దిపేట అర్బన్: తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని, ఎలాగైనా పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఆ అమ్మాయి గ్రామంతో పాటు.. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గ్రామంలో పోస్టర్లు అంటించాడు. అభ్యంతకరమైన పోస్టర్లు అంటించి అమ్మాయి పరువు తీసేందుకు ప్రయత్నించిన ఆ యువకుడితో సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు వివరాలు వెల్లడించారు.
దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేష్ (29) అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. యువతి తల్లిదండ్రులు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీన్ని జీర్ణించుకోలేని యువకుడు వివాహం ఆగిపోవాలనే ఉద్దేశంతో యువతితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోస్టర్లు సృష్టించాడు. ఆ అమ్మాయి గ్రామంతో పాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గ్రామంలో పోస్టర్లు అతికించాడు.
ఈ విషయమై త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నేరం ఒప్పుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్ సహా అతనికి సహకరించిన వన్నెల అశ్విత్‌కుమార్, బండి భానుప్రసాద్, రేఖ, బురుజుకింది ఈశ్వర్, రాజబోయిన నవీన్‌కుమార్ ఉన్నారు.


