నెలలోగా సవరణలు చేయాలి  | Akal Takht Sahib, Giani Kuldip Singh Gargajj directs Punjab government | Sakshi
Sakshi News home page

నెలలోగా సవరణలు చేయాలి 

Jun 30 2026 4:50 AM | Updated on Jun 30 2026 4:50 AM

Akal Takht Sahib, Giani Kuldip Singh Gargajj directs Punjab government

ఆ తర్వాతే యాంటీ శాక్రిలేజ్‌ లా అమలు చేయాలి  

పంజాబ్‌ సర్కార్‌కు అకల్‌ తఖ్త్‌ నిర్దేశం 

మతపెద్ద ఎదుట హాజరైన సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులు

అమృత్‌సర్‌: పవిత్ర మత గ్రంథాల అవమాన నిరోధక చట్టం(యాంటీ శాక్రిలేజ్‌ లా)లో అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను నెల రోజుల్లోగా తొలగించాలని సిక్కుల మత పెద్ద అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ జ్ఞానీ కుల్దీప్‌ సింగ్‌ గర్గాజ్‌ పంజాబ్‌ ప్రభుత్వానికి గడువు విధించారు. అప్పటి వరకు చట్టం అమలును నిలిపివేయాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రంలోని సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం 87 మంది ఆయన అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా యాంటీ శాక్రిలేజ్‌ లాలోని పలు నిబంధనలపై ఆయన అభ్యంతరం తెలిపారు. వీటిపై తగు సవరణలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆప్‌ ప్రభుత్వం మత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని, అకల్‌తఖ్త్‌కు అతీతంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలోని నిబంధనలపై అభ్యంతరాలతో కూడిన జాబితాను ఎమ్మెల్యేలకు అందజేశారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌ ప్రతిని ‘బిర్‌’కు బదులుగా సరూప్‌ అని ప్రస్తావించాలని పేర్కొన్నారు. ఇలాంటివి చేసేముందు అకల్‌ తఖ్త్‌ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 

చట్టంలో మార్పులు తీసుకురావడం సమ్మతమేనంటూ ఎమ్మెల్యేలంతా చేతులు పైకెత్తి సమ్మతం తెలిపారని అనంతరం గర్గాజ్‌ మీడియాకు తెలిపారు. తగు మార్పులు తీసుకువచ్చే వరకు చట్టం అమలును నిలిపివేయాలన్నారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అవమానించే డేరా చీఫ్‌లపై వెంటనే కేసు నమోదు చేసేలా నిబంధన తీసుకురావాలని స్పష్టం చేశారు. 

మతపరమైన పవిత్ర గ్రంథాలను, వస్తువులను అపవిత్రం చేయడం, దెబ్బతీయడం, అవమానించడం (పంజాబీలో బెఅద్బీ) వంటి చర్యలను నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం జాగత్‌ జోత్‌ శ్రీ గురు గ్రంథ్‌ సాహిబ్‌ సత్కార్‌(సవరణ)–2026ను పంజాబ్‌ అసెంబ్లీ ఏప్రిల్‌ 13న ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం గురుగ్రంథ్‌సాహిబ్‌ను అవమానించిన వారికి జీవిత కారాగారం వంటి కఠిన శిక్షలుంటాయి. దీనిపై జతేదార్‌ గర్గాజ్‌ సింగ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. 

తమతో సంప్రదించకుండానే, ప్రభుత్వం మత విషయాల్లో జోక్యం చేసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుగ్రంథ్‌ సాహిబ్, సిఖ్‌ సంగత్, సేవాదార్లపైనే చట్టాలను అమలు చేయాలని చూస్తోందన్నారు. ఈ మేరకు మే 11వ తేదీన పంజాబ్‌ ప్రభుత్వానికి అకల్‌ తఖ్త్‌ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని, అకల్‌ తఖ్త్‌ను, సిక్కుల సెంటిమెంట్‌ను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఎదుట హాజరు కావాలంటూ సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులకు జూన్‌ 15వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సోమవారం ఆయన ఎదుట వీరంతా హాజరయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement