అయోధ్య విరాళాల కేసు.. చంపత్‌ రాయ్‌కు ఊరట | Ram Temple Donation Theft Case: Champat Rai Get SIT Clean Chit | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల కేసు.. చంపత్‌ రాయ్‌కు ఊరట

Aug 18 2026 10:30 AM | Updated on Aug 18 2026 10:38 AM

Ram Temple Donation Theft Case: Champat Rai Get SIT Clean Chit

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. చంపత్‌తో పాటు ట్రస్ట్‌ మాజీ సభ్యుడు అనిల్‌ మిశ్రాకు కూడా కేసులో ఎలాంటి పాత్ర లేదని సిట్‌ తేల్చింది. 

రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు, నగదు చోరీ జరిగాయన్న ఆరోపణలు తెరపైకి రావడంతో చంపత్‌ రాయ్‌, అనిల్‌ మిశ్రా ఇద్దరూ జూన్‌ 27న తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రత, నిర్వహణకు సంబంధించిన అంశాలపై SIT అధికారులు వారిని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా చంపత్‌ రాయ్‌ తనకు విరాళాల చోరీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన SIT తన తుది నివేదికను సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌ హోం శాఖకు సమర్పించింది. అనంతరం దానిని తదుపరి చర్యల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు.

‘అక్రమాలు తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నా’
విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటం తన బాధ్యతేనని చంపత్‌ రాయ్‌ SITకు వివరించినట్లు సమాచారం. అక్రమాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సందర్భంగా ఆయన వాంగ్మూలంతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన SIT.. విరాళాల చోరీలో రాయ్‌, అనిల్‌ మిశ్రా పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని నిర్ధారించినట్లు సమాచారం.

జూన్‌ 13న SIT ఏర్పాటు
రామ మందిర విరాళాల చోరీ ఆరోపణలపై ట్రస్ట్‌ అభ్యర్థన మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 13న ముగ్గురు సభ్యులతో SITను ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్‌ కమిషనర్‌ విజయ్‌ విశ్వాస్‌ పంత్‌ ఈ బృందానికి నేతృత్వం వహించారు. రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కిరణ్‌ ఎస్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్‌ రతన్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలోపే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

SIT జూన్‌ 23న ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. విరాళాల నిర్వహణ వ్యవస్థలో పలు లోపాలను గుర్తించిన బృందం.. వాటిని సరిదిద్దేందుకు కఠినమైన సిఫార్సులు చేసింది.

ఎనిమిది మందిపై FIR
SIT ప్రాథమిక నివేదిక ఆధారంగా ట్రస్ట్‌ సభ్యుడు కృష్ణమోహన్‌ శ్రీరామ జన్మభూమి పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో జూన్‌ 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో అవినాశ్‌ శుక్లా, అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌కుష్‌ మిశ్రా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌, కరుణేశ్‌ పాండే, రామశంకర్‌ మిశ్రా, సుభాష్‌ శ్రీవాస్తవ, రామ్‌ శంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్నూ సహా పలువురి పేర్లను చేర్చారు. మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(a) కింద కేసులు నమోదు చేశారు. SIT సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే తదుపరి FIRలు, అరెస్టులకు సంబంధించిన చర్యలు కొనసాగాయి.

తాజాగా SIT తుది నివేదికలో చంపత్‌ రాయ్‌, అనిల్‌ మిశ్రాకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఈ కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇక దర్యాప్తు నివేదిక ఆధారంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తదుపరి చర్యలు తీసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement