కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి పాత వివాదం తెరపైకి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నందిగ్రామ్‌లో అప్పటి సీఎం మమతా బెనర్జీ కాలికి తగిలిన గాయం ‘ఫేక్’ అంటూ ప్రస్తుత సీఎం సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా వైద్యపరమైన పత్రాలు తన వద్ద ఉన్నాయని, ఎవరైనా సవాల్ చేస్తే వాటిని బహిర్గతం చేస్తానని చెప్పారు.
నందిగ్రామ్-2 బ్లాక్‌లోని బిరులియా బజార్‌లో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ తరఫున ప్రచారం చేస్తూ సువేందు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. 2021లో మమతకు గాయం జరిగిన ప్రాంతం ఇదే. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి వెళ్లానని సువేందు తెలిపారు. భబానీపూర్ నియోజకవర్గ పరిధిలో ఆస్పత్రి ఉండటంతో ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడిగా తనకు కొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మమతకు సంబంధించిన ఎక్స్‌రే రిపోర్టు కాపీ తన వద్ద ఉందని, అందులో ఆమె వైద్యులు ‘ఫ్రాక్చర్ లేదు’ అని పేర్కొన్నారని ఆయన ఆరోపించారు.
అసలు ఏం జరిగింది?
2021 మార్చి 10న నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమతా బెనర్జీ గాయపడ్డారు. తన వాహనం వద్ద భారీగా గుమిగూడిన జనంతో జరిగిన తోపులాటలో కాలు వాహనం తలుపు మధ్య ఇరుక్కుపోయిందని ఆమె అప్పట్లో చెప్పారు. అనంతరం ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఎస్‌ఎస్‌కేఎం వైద్యులు చేసిన ప్రాథమిక పరీక్షల్లో ఎడమ చీలమండ, పాదంలో తీవ్ర బోన్ ఇంజరీస్‌తో పాటు కుడి భుజం, ముంజేయి, మెడ తదితర ప్రాంతాల్లో గాయాలు ఉన్నట్లు వెల్లడించారు. మార్చి 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మమత ఎడమ కాలికి కాస్ట్‌తో వీల్‌చైర్‌లోనే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
అయితే తాజాగా సువేందు అధికారి మాత్రం ఆ గాయం తీవ్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. వాహనం తలుపు రోడ్డుపక్కన ఉన్న ఇనుప స్తంభాన్ని ఢీకొని తిరిగి మమత కాలికి తగిలిందని, దాంతో స్వల్ప గాయం మాత్రమే అయిందని ఆయన వాదించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన పత్రాలను బహిరంగపరుస్తానని సువేందు ప్రకటించడంతో 2021 నాటి నందిగ్రామ్ ఘటన మరోసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన తాజాగా ప్రస్తావించిన పత్రాలు పూర్తిగా బహిరంగంగా అందుబాటులోకి వచ్చాయా, వాటిలో ఏముంది అనే విషయం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు.
ఇదీ చదవండి: విజయ్ టార్గెట్‌గా స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు


