యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా? | Kommineni Srinivasa Rao Comments On Amit Shah Uniform Civil Code | Sakshi
Sakshi News home page

యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?

Oct 3 2026 12:36 PM | Updated on Oct 3 2026 12:46 PM

Kommineni Srinivasa Rao Comments On Amit Shah Uniform Civil Code

దేశంలోని ఎన్‌డీఏ రాష్ట్రాలలో ఉమ్మడి పౌర స్మృతి(యూనిఫాం సివిల్ కోడ్)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం కొత్త వివాదం అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్‌డీఏలో భాగస్వామి అయిన జేడీ(యు) ఈ ప్రతిపాదనకు ఓకే చేస్తున్నా, బిహారులో మాత్రం అమలు చేయరాదని డిమాండ్ చేస్తోంది. అలాగే మరికొన్ని ఎన్‌డీఏ పక్షాలు కూడా ఈ ప్రతిపాదనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అమిత్ షా  ప్రకటనతో ఇబ్బందిలో పడిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడానికే సిద్దపడుతున్నట్లు కనబడుతోంది.

ఒకప్పుడు తలాఖ్ చట్టాన్నే వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు యూసీసీకి మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు దీనిపై నేరుగా వ్యాఖ్య చేయనప్పటికీ , ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చాలా స్పష్టంగా అమిత్ షా ప్రకటన మేరకు నడుచుకుంటామని తెలిపారు. నిజానికి దేశం అంతటికి కలిపి పార్లమెంటులో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు  పెట్టవలసి ఉంటుంది. కాని బీజేపీ అందుకు సిద్దపడడం లేదు. రాష్ట్రాలవారీగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ఉంది.

ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడంలో తప్పేముంది? దేశంలో ఉన్న పౌరులందరికి సమానమైన నియమ, నిబంధనలు పెట్టడం మంచిదే కదా అన్న అభిప్రాయం కలగడం సహజమే. ప్రత్యేకించి వ్యక్తిగత విషయాలైన పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం తదితర అంశాలలో యూసీసీ తీసుకువస్తామని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెబుతోంది. 2014 నుంచి బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కూడా వివిధ కారణాలతో ఈ ప్రతిపాదనను అమలు చేయలేకపోయింది. అయితే గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ యూసీసీని అమలు చేయడం ఆరంభించింది. ఇందులో ఉన్న అంశాలలో ప్రజలకు మేలు చేసేవి అయితే స్వాగతించవలసిందే. ఉదాహరణకు ఆయా విషయాలలో అన్ని మతాలలోని మహిళలకు సమానత్వం కల్పించడం మంచిదే. కాని ఇది అన్ని మతాలలో ఒకే విధంగా ఉండాలి. కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి ఈ చట్టం తెస్తున్నారన్న భావన కలగనివ్వరాదు.

బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సీఎఎ, త్రిబుల్ తలాఖ్ తదితర చట్టాలను తెచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది రాలేదు. ప్రత్యేకించి త్రిబుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని చాలామంది భావించారు. కాని ముస్లిం సమాజంలో కొంతమంది వ్యతిరేకించారు. బీజేపీ హిందూ మతాన్ని ఏకీకృతం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తోందన్నది కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాల విమర్శ. అయినప్పటికీ, బీజేపీ చిత్తశుద్దితో అందరిని సమానంగా చూసే చట్టాలు తెస్తే తప్పు లేదు. కాని అనేక మతపరమైన విషయాలలో బీజేపీ అనుసరిస్తున్న విధానం అంత సమర్ధనీయంగా లేదన్నది బుద్దిజీవుల భావన.

గోవాలో అమలు చేస్తున్న యూసీసీపై పలువురు తమ అసమ్మతి తెలియచేస్తున్నారు. అందులో పురుషాధిక్యతను చాటే విధంగా నిబంధనలు రూపొందించారన్నది ఆరోపణ. అలాగే వివిధ మతాలలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గౌరవించకపోతే సమాజంలో అశాంతి ప్రబలే ప్రమాదం ఉంటుంది. అన్ని మతాలవారిని ఒప్పించి ఇలాంటివాటిని తేగలిగితే బాగుంటుంది. కాని అది అంత తేలిక కాదు. ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ చేసిన యూసీసీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఈ యూసీసీని అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక దానిని అమలు చేయరు.పైగా మైనార్టీలు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో వారి మనోభావాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ భావిస్తుంది. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితి కొనసాగవచ్చు. బీజేపీ కనుక పవర్‌లోకి వస్తే అప్పుడు యూసీసీ అమలు ప్రతిపాదన ముందుకు రావచ్చు. అయితే అంతకుముందు ఎన్నికల మానిఫెస్టోలో ఈ అంశం చేర్చుతారా? లేదా? అన్నది చెప్పలేం.

ఇక ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వానికి ఈ అంశం ఇబ్బంది కలిగించేదే. బీజేపీతో స్నేహం తప్పనిసరి కనుక కేంద్రంలోని ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్లు  తెలుగుదేశం, జనసేన కూడా వినకతప్పదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన గత ఐదేళ్లుగా బీజేపీ విధానాలకు వంతపాడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎటువచ్చి తెలుగుదేశం పార్టీకే కొంత సమస్య అవుతుంది. ఒకప్పుడు ఈ విషయంలో బీజేపీపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ తెచ్చిన త్రిబుల్ తలాఖ్ చట్టాన్నే ఈయన వ్యతిరేకించారు. 2019లో బీజేపీ మళ్లీ గెలిస్తే ముస్లింలకు రక్షణ ఉండదని విమర్శించేవారు. కాని ఆ తర్వాత పరిణామాలలో 2024లో అధికారంలోకి రావడానికి బిజెపి అవసరం తప్పనిసరి అని గుర్తించి మెల్లగా ప్లాన్ మార్చేసుకున్నారు. ఎలాగైతేనేం మళ్లీ అధికారంలోకి రాగలిగారు. తదుపరి ప్రధాని మోదీని విపరీతంగా పొగడడం ఆరంభించారు. బీజేపీకన్నా తాము మతవాదంలో తక్కువేం కాదన్న చందంగా వ్యవహరించడం ఆరంభించారు.

ఇదీ చదవండి: బాబు ‘బీసీ’ బిల్డప్‌.. కోర్టు తీర్పుతో అట్టర్‌ ఫ్లాప్‌!

గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, ముస్లింల హక్కులకు భంగం కలిగితే ఒప్పుకోబోమని అనేవారు. కాని ఇప్పుడు ఆ మాట కూడా అనలేని పరిస్థితి ఏర్పడినట్లు ఉంది. యూసీసీని అంగీకరించబోమని గతంలో చంద్రబాబు అన్నారు. కాని పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం అమిత్ షా ప్రకటనను సమర్ధించడంతో టీడీపీ యూటర్న్ తీసుకున్నట్లయింది. దేశ సమైక్యతకోసం యూసీసీని బలపరుస్తామని ఆయన అన్నారు. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించారో చెప్పలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో ఎంత బలహీనంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. బిహార్‌ వంటి రాష్ట్రంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయు, లోక్ జనశక్తి పార్టీలోని రెండు వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. కాని టీడీపీ ఏపీ అధ్యక్షుడు మాత్రం పూర్తిగా సరెండర్ అయిపోయిన విధంగా మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతానికి దీనిపై చర్చ జరగలేదని అన్నారు.

వివిధ రాష్ట్రాలలో పలు రకాలు సంస్కృతులు ఉంటాయి. అలాగే ఆచారాలు ఉంటాయి. మతాలలోని అనాచారాలను సంస్కరించడం, మహిళలకు సమాన గౌరవం ఇవ్వడం వంటివి చేయడం స్వాగతించదగినవే. కాని బీజేపీ అధినేతలు ఆయా సందర్భాలలో మతాన్ని తమ రాజకీయం కోసం వాడుకుంటున్నారన్న విమర్శ ఎక్కువగా ఉంది. చివరికి ప్రధాని సైతం మత ఆధారిత ప్రసంగాలు చేస్తుంటారు. అందువల్లే వారి చిత్తశుద్దిపై సందేహాలు వస్తున్నాయి. కాకపోతే టీడీపీ వంటి పార్టీలు యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏపీలో ఈ ప్రతిపాదన అమలు చేస్తారో చెప్పలేం కాని, అదే జరిగితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటారు. ఏపీలో యూనిఫాం సివిల్ కోడ్  అమలు జరిగి, తెలంగాణలో అమలు కాకపోతే ఒక విభిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement